Site icon NTV Telugu

CM Revanth Reddy : వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేసి చూపిస్తాం.!

Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో కొత్త అధ్యాయం మొదలైందని, ఇది కేవలం అధికార మార్పిడి కాదని, పేదవాడి ఆకాంక్షల ప్రతిరూపమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. గత పదేళ్ల కాలంలో రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరిస్తూ, అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఆయన వివరించారు. ముఖ్యంగా రైతులకు సాగుపై నమ్మకం కలిగించడం , మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఆయన స్పష్టం చేశారు.

Amazon Alert : రూ. 25 వేలకే బ్రాండెడ్ ఏసీలు.. సమ్మర్ కోసం భారీ ఆఫర్లు.!

గత ప్రభుత్వ హయాంలో వరి పండించడంపై ఆంక్షలు విధించి రైతులను ఆందోళనకు గురిచేస్తే, ప్రస్తుత ఇందిరమ్మ రాజ్యం సన్న వడ్లు పండించే ప్రతి రైతుకు క్వింటాల్‌కు ₹500 బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఈ ఒక్క నిర్ణయం వల్ల దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుండటం గతంలో ఎన్నడూ చూడని పరిణామం. రుణమాఫీ పథకం ద్వారా ఇప్పటికే 25 లక్షల మందికి పైగా రైతులకు ₹21,000 కోట్ల మేర రుణ విముక్తి కలిగించామని, రాబోయే రోజుల్లో మిగిలిన వారికి కూడా ఈ ప్రయోజనం చేకూరుస్తామని సీఎం హామీ ఇచ్చారు. రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ కూడా వేగవంతమైందని, అన్నదాతను రాజును చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

మహిళా సంక్షేమం విషయానికి వస్తే, గత ప్రభుత్వం నాణ్యత లేని చీరలను పంపిణీ చేసి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. దానికి భిన్నంగా, నేతన్నలకు ఉపాధి కల్పిస్తూ నాణ్యమైన ‘పాలపిట్ట’ చీరలను నేయించి ఆడబిడ్డలకు సారెగా అందజేస్తున్నామని చెప్పారు. కేవలం చీరలకే పరిమితం కాకుండా, మహిళా సమాఖ్యల ద్వారా లక్షలాది మందికి వడ్డీ లేని రుణాలు అందిస్తూ వారిని పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నామని తెలిపారు. ఇక పేదవాడి సొంతింటి కల విషయానికి వస్తే, 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా ప్రతి పేద కుటుంబానికి గూడు కల్పించే యజ్ఞం మొదలైందని, స్థలం ఉన్న వారికి ₹5 లక్షల సహాయం, స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ మార్పు కేవలం ఆరంభమేనని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో మరింత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అమెజాన్ సేల్‌లో Xiaomi ధమాకా…! Best 55-inch TV Under 35k.. ఇలాంటి డీల్ మళ్ళీ రాదు.!

Exit mobile version