NTV Telugu Site icon

CM KCR: 14 మంది ప్రధానులు మారినా.. దేశ ప్రజల తలరాత మారలేదు

Cm Kcr Speech

Cm Kcr Speech

CM KCR Speech At Telangana Bhavan: స్వాతంత్రం వచ్చిన తర్వాత 14 మంది ప్రధానులు మారారని, అయినా దేశ ప్రజల తలరాత మారలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో రైతు సంఘ‌టిత శ‌క్తిని ఏకం చేద్దామ‌ని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు మ‌హారాష్ట్ర షెట్కారీ సంఘ‌ట‌న్ రైతు నేత శ‌ర‌ద్ జోషి ప్రణీత్ సహా పలువురు రైతు నేత‌లు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రైతుల పోరాటం న్యాయబద్ధమైనదని, త‌లచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదని చెప్పారు. చిత్తశుద్ధితో ప‌ని చేస్తే.. తప్పకుండా గెలిచి తీరుతామని అన్నారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో తానెన్నో ఆటుపోట్లను ఎదుర్కున్నానని, తెలంగాణ‌లో ఏం చేశామో మీరందరూ ఒకసారి చూడండని, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించండి అని రైతు నేతల్ని సూచించారు.

Bank Loan Fraud: ఎస్‌బీ‌ఐకి రూ.95 కోట్ల టోకరా.. నిందితుడి అరెస్ట్..

దేశ రాజధాని ఢిల్లీలో రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెల‌ల పాటు పోరాడారని.. ఆ సమయంలో రైతులను ఉగ్రవాదుల‌ని, ఖలీస్తానీలని, వేర్పాటవాదులని విమర్శించారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. అయితే.. రైతులు వెనకడుగు వేయకుండా తమ పోరాటాన్ని కొనసాగించడంతో, ప్రధాని మోడీ దిగివచ్చిన క్షమాపణ చెప్పారని, ఆ చట్టాలని ఉపసంహరించుకున్నారని తెలిపారు. 750 మంది రైతులు చ‌నిపోతే.. ప్రధాని కనీసం స్పందించలేదని మండిపడ్డారు. మన దేశంలో దేనికి కొదవ లేదని.. అయినప్పటికీ రైతులు, ప్రజ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని అన్నారు. తెలంగాణ ఏర్పడ‌క ముందు రైతులు, చేనేత‌లు ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహ‌త్యలు చేసుకునేవారని.. రైతుల గోస చూసి తన కన్నీళ్లు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని సుస్థిరం చేశామని, దాంతో రైతుల ఆత్మహత్యలు చాలావరకు తగ్గాయని పేర్కొన్నారు. దేశంలో 94 ల‌క్షల ఎక‌రాల్లో వ‌రి పండితే.. అందులో 56 ల‌క్షల ఎక‌రాల వ‌రి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే పండుతుందని సీఎం కేసీఆర్ తెలియజేశారు.

Huge Rat: జీవితంలో ఇంత పెద్ద ఎలుకను ఎప్పుడూ చూసి ఉండరు

ఇదిలావుండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో మ‌హారాష్ట్ర షెట్కారీ సంఘ‌ట‌న్ రైతు నేత శ‌ర‌ద్ జోషి ప్రణీత్‌తో పాటు కొందరు రైతు నేతలు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కిసాన్ స‌మితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చ‌డునీ, మ‌హారాష్ట్ర కిసాన్ స‌మితి అధ్యక్షుడు మాణిక్ క‌దం, మంత్రులు స‌త్యవ‌తి రాథోడ్, హ‌రీశ్‌రావు, ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో పాటు ప‌ల‌వురు నేత‌లు పాల్గొన్నారు.

Show comments