Site icon NTV Telugu

CM KCR: కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. నా కూతుర్ని కూడా బీజేపీలోకి రమ్మన్నారు..!

Cm Kcr

Cm Kcr

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌ రావు.. భారతీయ జనతా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. అధికార టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించి.. దొరికిపోయిన ఘటన తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన కూతురు, ఎమ్మెల్సీ కవితను కూడా బీజేపీ నేతలు తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించారని.. ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? అని ఫైర్‌ అయ్యారు.. అయితే, టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఆ పార్టీ నేతలు.. తమతో టచ్‌లో ఉన్నారు.. ఏ క్షణంలోనైనా మా పార్టీలో చేరతారంటూ బీజేపీ నేతలు చెబుతూ వస్తున్న తరుణంలో.. ఏకంగా సీఎం కూతురు కవితను కూడా బీజేపీ ఆహ్వానించిందా? అనేది ఇప్పుడు రచ్చగా మారింది.. ఇక, షెడ్యూల్ ప్రకార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని స్పష్టం చేసిన కేసీఆర్.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ప్రస‌క్తే లేదని తేల్చేశారు.. పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలి.. మరో 10 నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయన్నారు.. ప్రభుత్వ ప‌థ‌కాల‌ను ప్రజ‌ల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై కూడా చర్చించారు.. ప్రజల మ‌ధ్యలోనే ఎమ్మెల్యేలు, నేతలు ఉండాల‌ని ఆదేశించారు సీఎం కేసీఆర్..

Read Also: CM KCR : ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్‌

మరోవైపు, సిట్టింగ్‌లకే మళ్లీ అవకాశం ఇస్తామని కూడా స్పష్టం చేశారు కేసీఆర్‌.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జిని నియమిస్తామన్న ఆయన.. మంత్రులు యాక్టివ్‌గా ఉండాలి.. ఎందుకు ప్రభుత్వ స్కీమ్ ల గురించి విస్తృతంగా మాట్లాడడం లేదు అని మంత్రులను ప్రశ్నించారు.. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని మంత్రులకు సూచించిన కేసీఆర్.. నాతో కలిసి పోరాటానికి సిద్ధమా అని సమావేశంలో నేతలను అడిగారు.. దీంతో, పోరాటానికి తాము సిద్ధమే అని చేతులెత్తి సంఘీభావం తెలిపారు నేతలు.. ఇక, కేంద్రానికి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి.. మనకు దర్యాప్తు సంస్థలు ఉన్నాయి.. తేల్చుకుందామని సవాల్‌ చేశారు.. అన్నింటికీ సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించిన కేసీఆర్‌.. సమావేశంలోని వివరాలు ఎక్కడ బయటకు చెప్పొద్దు.. సీరియస్‌ అని నేతలకు స్పష్టం చేశారు.. మీ ఫోన్లపై నిఘా ఉంటుందని కూడా వార్నింగ్‌ ఇచ్చారు టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌.

Exit mobile version