NTV Telugu Site icon

CM KCR: మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Kcr Press Meet

Kcr Press Meet

మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. సమ్మక్క బ్యారేజీ వద్ద 9 లక్షల క్యూసెక్కుల నీరు పోతుందని ఆయన అన్నారు. తెల్లారే సరికి ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నిండిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని.. 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయని, విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఎయిర్ ఫోర్స్ వారితో మాట్లాడి హెలికాప్టర్లను కూడా సిద్ధం చేయాలని కోరామని సీఎం వెల్లడించారు. రాబోయే మూడు రోజులు బుధవారం వరకు అన్ని రకాల విద్యా సంస్థలు మూసేయడం జరిగిందని ఆయన అన్నారు.

రోడ్లు, కల్వర్టలపై ప్రయాణించే సమయంలో ప్రమాదాలు సంభవించే అధికారం ఉందని.. అలాంటివి చేయకుండా ఇప్పటికే ఆర్టీసీకి ఆదేశాలు జారీ చేశామని అన్నారు. కొన్ని పాత ఇళ్లను రాష్ట్రంలో కూలగొట్టామని.. కొన్ని కోర్టు స్టేల్లో ఉన్నాయని.. అలాంటి ఇళ్లలో ప్రజలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోెవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. బోధన్ నియోజకవర్గం, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురిశాయని ఆయన అన్నారు. ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కేసీఆర్ కోరారు.

Read Also: Vonteru Pratap Reddy: ముందు నువ్వు హుజూరాబాద్ లో గెలిచి ఉనికి చాటుకో..

ఎమ్మెల్యేలు, మంత్రులు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించామని.. కలెక్టర్లు, ఎస్పీలకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని వెల్లడించారు. 10 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే వాజేడు, మంగపేట, ఏటూర్ నాగారం మండలాల్లో గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. అక్కడ కూడా తగిన చర్యలు తీసుకున్నామని సీఎం వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ టీములను కొత్తగూడెం, నిజామాబాదుల్లో మోహరించామని వెల్లడించారు. ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలని.. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా సర్పంచు నుంచి మంత్రి వరకు ఎక్కడి వారు అక్కడ యాక్టివ్ గా ఉండాలని కోరారు.

నల్లగొండలో శ్రీకాకుళం వ్యక్తులు ఇద్దరు గోడ కూలి మరణించారని.. వారికి రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించామని కేసీఆర్ వెల్లడించారు. సెక్రటేరియట్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆర్ అండ్ బీలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని ఎక్కడ ఏ సమస్య వచ్చినా కంట్రోల్ రూంలకు ఫోన్ చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.