Site icon NTV Telugu

KCR: లాంగ్‌ గ్యాప్‌ తర్వాత రాజ్‌ భవన్‌లో అడుగుపెట్టిన కేసీఆర్.. ఆసక్తికర సన్నివేశాలు..

KCR

KCR

తెలంగాణ ముఖ్యమంత్రి చాలా కాలం తర్వాత రాజ్‌భవన్‌లో అడుగుపెట్టారు.. అక్టోబరు 11వ తేదీన చివరిసారి రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.. ఇక, ఆ తర్వాత ఆయన రాజ్‌ భవన్‌కు వెళ్లింది లేదు.. అయితే, ఇవాళ కూడా ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లింది కూడా హైకోర్టు కొత్త సీజే ప్రమాణస్వీకారానికే.. ఈ రోజు హైకోర్టు ఐదో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్‌ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జస్టిస్​ ఉజ్జల్ భూయాన్‌తో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, మేయర్, అధికారులు హాజరయ్యారు.

Read Also: Live: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

కాగా, రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య గ్యాప్‌ పెరుగుతూ వచ్చింది.. ఆ పరిణామాలపై గవర్నర్‌ తమిళిసై కొన్ని సార్లు బహిరంగంగానే వ్యాఖ్యలు చేసి వార్తలు నిలిచారు.. టీఆర్ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.. కొన్ని ఘటనలపై నివేదికలు కోరినా.. తనకు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు.. సర్కార్ నన్ను అవమానిస్తోందంటూ గవర్నర్ స్వయంగా పలు సందర్భాల్లో తెలిపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా గవర్నర్‌, సీఎం మధ్య దూరం పెరిగిపోయింది.. గతంలో నరసింహన్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో.. తరచూ రాజ్‌భవన్‌కు వెళ్లే కేసీఆర్.. గవర్నర్‌గా తమిళిసై వచ్చిన తర్వాత మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత పరిస్థితి మారిపోయింది.. గవర్నర్ తమిళి సైతో ఇటీవల కాలంలో ఎక్కడా ఆయన వేదిక పంచుకోలేదు. గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వచ్చారు.. చివరకు ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కూడా ఆయన దూరంగానే ఉన్నారు..

ఓవైపు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్‌ ప్రభుత్వాల దూరం పెరగడంతో పాటు.. మరోవైపు రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య కూడా సంబంధాలు సన్నగిల్లిపోయాయి.. ఈ నేపథ్యంలో.. రాజ్‌భవన్‌ వేదికగా జరుగుతోన్న హైకోర్టు సీజే ప్రమాణస్వీకారానికి సీఎం కేసీఆర్‌ హాజరు అవుతారా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.. కానీ, అనూహ్యంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు సీఎం కేసీఆర్.. దాదాపు 8 నెలల తర్వాత గవర్నర్‌ తమిళిసైతో కలిసి వేదిక పంచుకున్నారు.. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.. నవ్వుతూ పలకరించుకున్నారు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై మధ్య నవ్వులు పూశాయి.. టీ తాగుతూ ముచ్చటించుకున్నారు.

Exit mobile version