సీఎల్పీ బృందం కాలేశ్వరం వెళ్లకుండా అడ్డుకోవడానికి కారణమేంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ప్రభుత్వం తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అక్కడ కాళేశ్వరం ఉందా మాయమైందా? సీఎల్పీ బృందం అక్కడ చూడకూడనివి ఏమైనా ఉన్నాయా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయడానికి విదేశాల నుంచి తీసుకొచ్చిన బాహుబలి మోటర్లు వరద ముంపులో మునిగిపోయాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Marri Shashidhar Reddy: ఆ మాజీ సీఎం తనయుడికి ఎందుకు మండింది?
మునిగిన బాహుబలి పంపులు తిరిగి పని చేస్తాయా లేదా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా లేదా అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో బాహుబలి మోటార్లు ఎందుకు మునిగాయి. ఎంత నష్టం వచ్చింది? అక్కడ జరుగుతున్న నిర్మాణ లోపాలు ఏంటి? తెలుసుకోవడానికి వెళుతున్న సీఎల్పీ బృందాన్ని పోలీసులతో ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుంది. కాళేశ్వరం ఏమైనా నిషేధిత ప్రాంతమా? శత్రు దేశాలకు తెలియని సమాచారం అక్కడ పెట్టి దానిని ఏమైనా రహస్య ప్రాంతంగా ప్రకటించారా? ప్రాజెక్టుకు వెళ్లకుండా పోలీసులతో ఎందుకు అడ్డుకుంటున్నారు అని ఆయన దుయ్యబట్టారు.
పది రోజుల ముందు అధికారులకు సమాచారం ఇచ్చి మంగళ బుధవారాల్లో ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన తమ సీఎల్పీ బృందాన్ని ప్రివెంట్ కస్టడీ పేరిట అరెస్టులు చేయడం ఖండిస్తున్నా అన్నారు భట్టి విక్రమార్క. కాళేశ్వరంలో 144 సెక్షన్ విధించడానికి కారణం ఏంటి? కాలేశ్వరం ఏమైనా కల్లోలిత ప్రాంతమా? రహస్య ప్రాంతమా? ఎందుకు ఈ నిర్బంధం? ఎందుకు 144 సెక్షన్ విధించారు? కాళేశ్వరం వెళ్లకుండా ప్రభుత్వం పోలీసులతో ఈరోజు అడ్డుకోవచ్చు కానీ ఖచ్చితంగా సీఎల్పీ బృందం కాలేశ్వరానికి వెళుతుంది అక్కడ ఉన్న రహస్యాలు ఏంటో తెలుసుకొని బట్టబయలు చేస్తుందన్నారు.
మంథని నియోజకవర్గం పరిధిలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు శ్రీధర్ బాబుని సైతం నియోజకవర్గంలో తిరగకుండా ప్రభుత్వం పోలీసులతో అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు భట్టి విక్రమార్క. ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క తదితరులు పాల్గొన్నారు.
Read Also: YSR Nethanna Nestam: ఏపీలో నేతన్నలకు శుభవార్త.. ఈనెల 23న అకౌంట్లలో రూ.24వేలు జమ
