NTV Telugu Site icon

టి.కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ..! రేవంత్‌, మహేశ్వర్‌రెడ్డి మధ్య వాగ్వాదం

Maheshwar Reddy

Maheshwar Reddy

తెలంగాణ కాంగ్రెస్‌లో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇటీవల టీపీసీ చీఫ్‌రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి సభకు పిలుపునివ్వడంపై పార్టీలోని కొందరు నేతలు అగ్గిమీద గుగ్గులం అవుతున్నారు. తమకు చెప్పకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై గాంధీ భవన్‌లో జరిగిన పీసీసీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశంలో వాడీ వేడీ చర్చ జరిగింది.

రేవంత్‌రెడ్డి ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి. జిల్లా నాయకులకు సమాచారం ఇవ్వకుండా.. ఇంద్రవెల్లి సభను ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇంద్రవెల్లిలో సభ ప్రకటిస్తే ఇబ్బంది ఏంటని.. అసలు ఇంద్రవెల్లికి నీకు ఏం సంబంధం అని మహేశ్వర్‌రెడ్డిని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో సీనియర్లు సర్దిచెప్పారు. ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్‌గా మహేశ్వరెడ్డికి.. అన్ని నియోజకవర్గాలపైనా బాధ్యత ఉందని.. సమావేశంలో సభ ప్రాంతాన్ని చెబితే అయిపోయేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కొందరు సీనియర్లు. ఇక, అంతకు ముందు మీడియాతో చిట్‌చాట్ చేసిన మహేశ్వర్‌రెడ్డి ఇంద్రవెల్లి సభ ఎందుకు పెడుతున్నారో తెలియదన్నారు. ఇండియన్‌ నేషనల్ కాంగ్రెస్సో.. లేక రేవంత్‌రెడ్డి కాంగ్రెస్సో ఈ మీటింగ్‌లో తేలిపోతుందన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ఇంద్రవెల్లి దండోరా ప్రకటనపై ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆదివాసీలు, లంబాడీలు కలిసి పోరాడారన్న రేవంత్‌ వ్యాఖ్యలను ఖండించారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని.. లేదంటే ఇంద్రవెల్లి సభను అడ్డుకుంటామని హెచ్చరించారు.