NTV Telugu Site icon

Telugu Desam Party: రేపు ఖమ్మంలో టీడీపీ శంఖారావం సభ.. హాజరుకానున్న చంద్రబాబు

Chandrababu

Chandrababu

Telugu Desam Party: తెలంగాణలో డీలా పడ్డ టీడీపీకి మళ్లీ పూర్వవైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో రానున్న ఎన్నికలకు పార్టీని బలోపేతం చేయాలని ఆయన నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కాస్త బలం ఉన్న ఖమ్మం వేదికగా చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 21న ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ గ్రౌండ్‌లో టీడీపీ శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు చంద్రబాబు హాజరవుతున్నారు. హైదరాబాద్ నుంచి భారీ వాహనశ్రేణితో ఈ సభకు ఆయన వెళ్లనున్నారు. ఖమ్మంలో నిర్వహించబోయే సభకు 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది.

Read Also: Mancherial Six Died Case: ఆరుగురు సజీవ దహనం కేసు కొలిక్కి…

కాగా తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు నేతలు అప్పటి టీఆర్ఎస్‌లో చేరగా, విభజన తర్వాత మరికొందరు కాంగ్రెస్ పార్టీ బాటపట్టారు. దీంతో తెలంగాణలో టీడీపీకి సరైన నాయకత్వమే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో టీడీపీని మళ్లీ బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ హవాలో కూడా టీడీపీ రెండు సీట్లను గెలుచుకుంది. ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీకి ఇప్పటికీ క్యాడర్ ఉంది. పార్టీ సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందుకే ఖమ్మం నుంచి వచ్చే ఎన్నికల కోసం టీటీడీపీని బలోపేతం చేసే చర్యలను బాబు చేపట్టారు. ఖమ్మం సభ విజయవంతం అయితే రానన్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సభలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కాగా 2014 ఎన్నికల్లో తెలంగాణలో 15 సీట్లు గెలిచిన టీడీపీ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంది.