Chada Venkat Reddy On BRS Party: బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలేంటో సీఎం కేసీఆర్ తమకు ఇంకా తెలియజేయలేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ అవతరణ దినోత్సవ సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నిర్వహించిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలను బట్టే తమ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. రైతులు, కూలీలకు జరుగుతున్న అన్యాయంపై ఎవరు పోరాటం చేసినా సరే.. వాళ్లతో కలిసి తాము పని చేస్తామని, అందులో ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేశఆరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా.. ఇంతవరకు అర్హులైన వారికి ఇళ్లు, భూమి, పెన్షన్లు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకోకముందే.. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు జెండాలు పాటి, ఆ స్థలాల్ని ఆక్రమించుకొని, గుడిసెలు నిర్మించుకోవాలని చాడ వెంకటరెడ్డి కోరారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు ఇంకా అమలు కావట్లేదని, కనీస సౌకర్యాలైన విద్య, వైద్యం కూడా అందుబాటులో లేకుండా పోయాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ పేరుతో.. వ్యవసాయంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పోరేట్ వ్యవస్థకు అప్పగిస్తున్నారన్నారు. జనవరి 26న హక్కుల పరిరక్షణ దినంగా పాటిస్తామన్న ఆయన.. ఈ నెల 29న బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు.