తూర్పు తీర ప్రాంతంలో సమాంతరంగా మరో కొత్త రైలు కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్ పడింది. ప్రస్తుతం ఉన్న విజయవాడ-విశాఖ-భువనేశ్వర్-కోలకతా రైల్వే కారిడార్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త రైలు కారిడార్‌ను కేంద్రం నిర్మించినుంది. అసన్‌సోల్ (బెంగాల్) నుంచి వరంగల్ వరకు సరికొత్త కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. జునాగఢ్- నవరంగ్‌పూర్, మల్కన్‌గిరి – పాండురంగాపురం వయా భద్రాచలం రైల్వే లైన్లు ఈ కారిడార్లు భాగంగా ఉంటాయి. 174 కిలోమీటర్లు మల్కన్‌గిరి (ఒడిస్సా)-పాండురంగాపురం, వయా భద్రాచలం వరకు ఈ రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదం లభించింది. మల్కన్ గిరి (ఒడిస్సా) నుంచి (వయా భద్రాచలం) పాండురంగాపురం ( తెలంగాణ) వరకు రూ.4,109.18 కోట్ల రూపాయలతో 174 కి.మీ కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు.
ఈ కొత్త రైల్వే కారిడార్ ఏపీలో 85.5 కి.మీ, తెలంగాణలో 19.77 కి.మీ పొడవు ఉంటుంది. గోదావరి నదిపై వంతెన నిర్మాణంతో సహా మొత్తం 174 కి.మీ వరకు ఈ రైల్వే కారిడార్ ఉండనుంది. ఈ కొత్త రైల్వే కారిడార్ ద్వారా పశ్చిమ, దక్షిణ ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి దక్షిణ భారతదేశానికి మరింత కనెక్టివిటీ పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లోని పలు బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు ఈ కారిడార్ ద్వారా బొగ్గు సరఫరా చేయవచ్చు. అలాగే ఈ కొత్త రైల్వే కారిడార్ ద్వారా 500-700 కి.మీ దూరం తగ్గుతుంది. తీర ప్రాంతంలో తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు, రాకపోకలకు అంతరాయం లేకుండా కొత్త రైల్వే కారిడార్‌కు రైళ్లను మళ్లించవచ్చు. తుఫాన్లు కారణంగా “హౌరా-విజయవాడ” తీర ప్రాంత రైల్వే మార్గానికి అంతరాయం కలిగినా కొత్త రైల్వే మార్గం ద్వారా ఒడిస్సాలోని పలు జిల్లాలకు రాకపోకలు సజావుగా సాగుతాయి. తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా, ఏపీలో తూర్పు గోదావరి జిల్లాతో పాటు.. ఒడిస్సా లోని పలు జిల్లాల్లో సామజిక ఆర్థికాభివృద్ధికి ఈ కొత్త రైల్వే మార్గం దోహదం చేస్తుంది.
ఇక చాలా బిజీగా ఉండే విశాఖపట్నం-రాజమండ్రి రైల్వే కారిడార్‌పై ఒత్తిడి తగ్గేలా బైపాస్ చేస్తూ ఈ కొత్త కారిడార్‌కు రూపకల్పన చేశారు. దీనివల్ల దక్షిణ ఒడిస్సా, బస్తర్ ప్రాంతం నుంచి దక్షిణ భారతదేశానికి 124 కి.మీ దూరం కూడా తగ్గుతుంది. కొత్త రైల్వే కారిడార్ వల్ల ఆయా ప్రాంతాలకు ఆహార ధాన్యాలు, రసాయన ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్ రవాణా సులభమవుతుంది.