పోలీసులు, మీడియా ఎన్నిసార్లు హెచ్చరించినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు.. మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఊరు ఏదైనా… పేరు ఏదైనా మోసం ఒక్కటే. జనం అమాయకత్వమే పెట్టుబడిగా కోట్లు కొల్లగొడుతున్నారు. ఊరు పేరు తెలియని ఆన్లైన్ యాపుల్లో పెట్టుబడులు పెట్టొద్దని పోలీస్ శాఖ విస్త్రుత ప్రచారం చేస్తున్నా అత్యాశకు పోతున్న జనం లక్షల్లో పెట్టుబడులు పెట్టి చివరకు మోసపోయి లబోదిబోమంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికే ఇలాంటి మోసాలు ఎన్నో వెలుగులోకి రాగా.. తాజాగా మరో ఆన్ లైన్ మోసం తెరమీదకు వచ్చింది. క్యాటర్ పిల్లర్ అనే ఆన్ లైన్ యాప్ లో లక్షల్లో పెట్టుబడులు పెట్టి మోసపోయామంటూ బాధితులు పోలీస్ స్టేషన్ లకు క్యూ కడుతున్నారు .
600 నుంచి 10లక్షల వరకు… ఎంతైనా పెట్టుబడి పెట్టండి. అందుకు తగిన ఆదాయాన్ని, క్రమం తప్పకుండా పొందొచ్చంటే అంతా నమ్మారు. తొలుత చిన్నమొత్తాలతో పెట్టుబడులు ప్రారంభించారు. నిత్యం డబ్బులు జమయ్యే సరికి నమ్మకంతో పాటు ఆశా పెరిగింది. దీపావళీ ధమాకా పేరిట ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయం పొందాలని నిర్వాహకులు వల విసిరారు. అత్యాశకు పోయిన జనం ఆన్‌లైన్ వలకు చిక్కారు. లక్షల్లో డబ్బులుపోసి దారుణంగా మోసపోయారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వందల సంఖ్యలో బాధితులు ఉండగా, కొల్లగొట్టిన సొమ్ము కోట్లలో ఉంటుందని అంచనా, ఇప్పుడి ఆన్ లైన్ మోసం మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.
Read Also: Astrology: నవంబర్ 19, శనివారం దినఫలాలు
కొందరు మోసగాళ్లు క్యాటర్ పిల్లర్ (క్యాట్) యాప్ ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా డోజర్లు, హిటాచీలు, రోడ్ రోలర్లు అద్దెకు తీసుకొని పనులు చేస్తామని, ఇందుకు సహకారం కావాలని దసరా, దీపావళి సందర్భాల్లో పేద, మధ్య తరగతి, ఉద్యోగులు, చిరు వ్యాపారులను ఆకర్షించారు. యాప్ లో డబ్బులు డిపాజిట్ చేసిన వారికి మూడింతల లాభం వస్తుందని బోల్తా కొట్టించారు. 600 నుంచి 10 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చని, 600 కడితే ప్రతి రోజూ 18 రూపాయలు ,… వెయ్యికి 32 రూపాయలు , 12 వేలకు 360 రూపాయలు , 10 లక్షలకు 30 వేలు ఇస్తామని నమ్మించారు. ఇప్పటికే చేరిన వాళ్లు వేరేవాళ్లను చేర్పిస్తే ఎక్ స్ట్రా అమౌంట్ కూడా పే చేస్తామని నమ్మించారు. ఈ మాటలు నమ్మిన చాలామంది యాప్ నిర్వాహకులు పంపించిన లింక్ ల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు.
యూజర్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకుని పెట్టుబడులు పెట్టారు. మొదట్లో ప్రతిరోజూ అందరికీ డబ్బులు అకౌంట్లలో జమ చేయడంతో నమ్మారు. ఈ విషయాన్ని బంధువులు, దోస్తులకు చెప్పి మరీ చేర్పించారు. కొందరు అధిక లాభాలకు ఆశపడి పెట్టుబడి పెట్టేందుకు బంగారం, బైక్లు కూడా తాకట్టు పెట్టారు. ఇలా ఇప్పటి వరకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది . ఈ నెల 8వ తేదీ నుంచి యాప్ పని చేయడం మానేయడంతో పలువురు బాధితులు పోలీస్ స్టేషన్ లకు క్యూ కడుతున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా క్యాటర్ పిల్లర్ ఆన్ లైన్ యాప్ ద్వారా మోసపోయిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. విద్యావంతులు , వ్యాపారస్తులు , రోజు వారి వేతనంతో బతికే వాళ్లు , సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు అప్పులు చేసి , తమ వద్ద ఉన్న నగలు నట్ర కుదవ పెట్టి ఆ డబ్బుతో పెట్టు బడులు పెట్టినట్లు తెలుస్తోంది . అయితే ఇప్పటికే బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుండటంతో పోలీసులు విచారణ చేపట్టారు . ఆ యాప్ మోసాలు మహబూబ్ నగర్ జిల్లాకే పరిమితమయ్యాయా లేక , ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . బాధితులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: Andre Russell: న్యూడ్ ఫోటో షేర్ చేసిన స్టార్ క్రికెటర్.. రణ్‌వీర్‌సింగ్‌ను తలదన్నేలా ఉన్నాడుగా..!!