బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక నిర్ణయం వెలువడనుంది. ఈ అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ బుధవారం తొలి దశ తీర్పును ప్రకటించనున్నారు. మొదటగా ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పష్టత ఇవ్వనున్నట్లు స్పీకర్ కార్యాలయం తెలిపింది. తొలిదశలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరించనున్నారు. ఈ పిటిషన్లపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు విధించిన గడువు గురువారంతో ముగియనుంది. దీంతో గడువు ముగిసేలోగా స్పీకర్ తీర్పు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్‌ఎస్ దాఖలు చేసిన ఫిర్యాదులపై స్పీకర్ నెలలపాటు విచారణ జరపకుండా ఆలస్యం చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఇతర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడు నెలల్లోగా తేల్చాలని జూలై 31న ఆదేశాలు జారీ చేసినప్పటికీ, అక్టోబర్ 21తో గడువు ముగిసినా నిర్ణయం తీసుకోకపోవడంపై తీవ్రంగా మండిపడింది. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని వ్యాఖ్యానించింది.
అంతేకాదు, గత నెల 17న నాలుగు వారాల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని తుదిగడువు విధిస్తూ కఠిన వ్యాఖ్యలు చేసింది. నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్‌కు ఇబ్బందులు తప్పవని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై బుధవారం తీర్పు వెలువరించనున్నారు. వీరు పార్టీ ఫిరాయించారనేందుకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ అనర్హత వర్తించదని స్పీకర్ ప్రకటించే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఐదుగురిపై తీర్పు ఇచ్చిన అనంతరం, మిగిలిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కావాలని స్పీకర్ సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా, పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా, ఇప్పటివరకు ఎనిమిది మంది మాత్రమే సమాధానాలు సమర్పించారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్‌ను నేరుగా కలిసి మరికొంత సమయం కోరగా, దానం నాగేందర్ ఇప్పటివరకు స్పందించలేదు. గురువారం జరగనున్న సుప్రీంకోర్టు విచారణపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
IND vs SA 4th T20I: నేడే నాల్గవ టీ20.. టీమిండియా సిరీస్ గెలుస్తుందా..?
