Site icon NTV Telugu

Gongadi Sunitha : కవిత తీరుతో కేసీఆర్ కంటతడి.. ఆమెవి అన్నీ డ్రామాలే..!

Gongadi Sunitha

Gongadi Sunitha

బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అత్యంత ఘాటుగా స్పందించారు. కవిత మాటలు బీఆర్ఎస్ పార్టీకి పెను ఇబ్బందిగా మారాయని, ఆమె ఎవరో వెనుక ఉండి ఆడిస్తుంటే కీలుబొమ్మగా మారి ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా కేసీఆర్ గారిని కంటతడి పెట్టిస్తూ, ఆయనను మానసిక క్షోభకు గురి చేస్తున్న వైనాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సునీత స్పష్టం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీని బహిష్కరిస్తే, కవిత మాత్రం భిన్నంగా వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ఆమె నిలదీశారు.

CM Chandrababu Counter: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్..!

కవిత తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా కేవలం ఒక నాటకమని, ఆమె మనస్ఫూర్తిగా ఆ పని చేయలేదని సునీత ఎద్దేవా చేశారు. ఒకవేళ నిజంగానే పదవి అవసరం లేదనుకుంటే కౌన్సిల్ సమావేశాలకు ఎందుకు హాజరయ్యారని ప్రశ్నించారు. అసలు పార్టీలో స్వేచ్ఛ లేకపోతే కవిత ఇన్ని పదవులు ఎలా పొందగలిగారని, ఓడిపోయినప్పటికీ కేసీఆర్ గారు ఆమెకు ఎమ్మెల్సీగా గౌరవప్రదమైన అవకాశం కల్పించిన విషయాన్ని మర్చిపోకూడదని హితవు పలికారు. పార్టీలో కవితకు ఉన్నంత చనువు మరెవరికీ లేదని, అలాంటిది ఇప్పుడు పార్టీని డ్యామేజ్ చేసేలా మాట్లాడటం కూర్చున్న కొమ్మను నరుక్కున్న చందంగా ఉందని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ పార్టీగా మార్చడం ఇష్టం లేదంటున్న కవిత, మరి తన సొంత సంస్థ అయిన తెలంగాణ జాగృతిని ‘భారత జాగృతి’గా ఎలా మార్చారని సునీత నిలదీశారు. ఇది ఆమె ద్వంద్వ వైఖరికి నిదర్శనమని, కంకణం కట్టుకుని మరీ బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయాలని కవిత చూస్తున్నారని ఆరోపించారు. లిక్కర్ కేసులో కవిత ఇరుక్కున్నప్పుడు హరీష్ రావు , కేటీఆర్ వారానికి నాలుగు సార్లు ఢిల్లీకి తిరిగి ఆమె కోసం ఎంతో శ్రమించారని, కానీ ఇప్పుడు ఆమె మాత్రం పార్టీకి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు కనీస సమయం ఇవ్వని ప్రభుత్వం, కవితకు మాత్రం అంత సమయం ఎలా కేటాయించిందో చూస్తుంటే ఆమెను ఎవరు నడిపిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోందని, ఇకపై ఆమె ఆటలు సాగవని గొంగిడి సునీత హెచ్చరించారు.

ONGC Gas: మంటలను వెంటనే అదుపులోకి తీసుకరండి.. గ్యాస్ లీకేజీపై సీఎం ఆరా..!

Exit mobile version