Bonalu 2026: గోల్కొండ నుంచి లాల్‌దర్వాజా వరకు.. బోనాల జాతరకు సర్వం సిద్ధం..

  • బోనాల కోసం భారీ ఏర్పాట్లు
  • 3,427 ఆలయాలకు రూ.15.05 కోట్లు
  • గోల్కొండ నుంచి లాల్‌దర్వాజా వరకు జాతర
  • భక్తులకు కట్టుదిట్టమైన భద్రత
Bonalu

Bonalu

Bonalu 2026: తెలంగాణ విశిష్ట సంస్కృతికి, భక్తిభావానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు గోల్కొండ నుంచి లాల్‌దర్వాజా వరకు జరిగే ఈ చారిత్రాత్మక బోనాల జాతరకు పక్కా ప్రణాళికతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులను సమన్వయం చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

3,427 ఆలయాలకు రూ.15.05 కోట్ల నిధులు విడుదల

నగరంలోని అమ్మవారి ఆలయాలన్నింటినీ దేదీప్యమానంగా అలంకరించేందుకు , ఉత్సవాలను వైభవంగా జరిపేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఈ బోనాల ఉత్సవాల నిమిత్తం మొత్తం 3,427 దేవాలయాలకు రూ. 15 కోట్ల 5 లక్షల 41 వేల 150 రూపాయలను విడుదల చేసినట్లు మంత్రి ప్రకటించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ, పోలీసు , ఆరోగ్య శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

గోల్కొండ బోనాలతో ప్రారంభం.. నెల రోజుల పాటు ఉత్సవాల కోలాహలం

చారిత్రాత్మక గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో జూలై 16న సమర్పించే తొలి బోనంతో ఈ ఆషాఢ మహోత్సవాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఆ వెంటనే జూలై 20, 21, 22 తేదీల్లో నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాలు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగనున్నాయి. ఇందులో భాగంగా జూలై 20న అమ్మవారి ఎదుర్కోలు ఉత్సవం, జూలై 21న ప్రధాన ఘట్టమైన అమ్మవారి కల్యాణం, జూలై 22న రథోత్సవం జరగనున్నాయి.

లష్కర్ బోనాలు.. పాతబస్తీ జాతరతో ముగింపు

ఆ తర్వాత ఆగస్టు 2న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో లష్కర్ బోనాల సమర్పణ ఘనంగా జరగనుంది. ఆ మరుసటి రోజున అంటే ఆగస్టు 3న భవిష్యవాణి వినిపించే ప్రసిద్ధ ‘రంగం’ కార్యక్రమంతో పాటు అమ్మవారి సాకల ఊరేగింపు నిర్వహిస్తారు. చివరగా ఆగస్టు 9న పాతబస్తీలోని ప్రఖ్యాతి గాంచిన లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలతో పాటు, హైదరాబాద్ నగరంలోని మిగిలిన ప్రధాన దేవాలయాల్లో ఉత్సవాలు పరాకాష్టకు చేరుకోనున్నాయి. తెలంగాణ అస్తిత్వానికి అద్దం పట్టే ఈ మహోత్సవాల్లో భక్తులు సులభంగా అమ్మవారిని దర్శించుకునేలా క్యూలైన్లు, తాగునీరు, పారిశుధ్యం , ట్రాఫిక్ నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచింది.