Site icon NTV Telugu

Vijayashanti : కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ప్ర‌జ‌ల కంటే కేసీఆర్ కుటుంబానికే ఎక్కువ లాభం

Vijayashanti

Vijayashanti

BJP Women Leader Vijayashanti Criticized TRS Government

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లో అవినీతి జరిగిందంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్‌ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. తాజాగా ఆమె.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని స‌ర్వరోగ నివారిణిగా చెబుతూ… కేసీఆర్ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకుంటున్నాడని ఆరోపించారు. అంతేకాకుండా.. తాజాగా సుప్రీం కోర్టు భారీ షాక్ ఇచ్చిందని, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన మూడో టీఎంసీ పనుల్లో స్టేటస్ కో పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు విజయశాంతి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పనులు నిలిపేయాలని స్పష్టం చేసిందని, భూసేకరణ గురించి పక్కనపెడితే… ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్‌లు లేవన్న విషయాన్ని కోర్టు ప్రస్తావించిందని విజయశాంతి వెల్లడించారు. భూసేకరణ లావాదేవీలను సమగ్రంగా నమోదు చేస్తామని, భూసేకరణ చట్టబద్ధతను హైకోర్టు తేల్చాలని పేర్కొందని విజయశాంతి తెలిపారు.

 

దీనిపై ఆగస్టు 16 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించిందన్నారు విజయశాంతి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా… ప్ర‌జ‌ల కంటే కేసీఆర్ కుటుంబానికే ఎక్కువ లాభం జ‌రిగింది… జ‌రుగుతోందంటూ విజయశాంతి విమర్శించారు. కమీష‌న్ల కోసం క‌క్కుర్తితో… అవ‌సరం లేకపోయినా కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌ను రీడిజైన్ చేయించి కేసీఆర్ వేల కోట్లు వెనకేసుకున్నాడని ఆమె ఆరోపించారు. క‌నీసం ఆ ప్రాజెక్టుకు… ఎన్విరాన్మెంట్ క్లియ‌రెన్స్‌లు కూడా లేవని, ఇప్ప‌టికే గోదావ‌రి వ‌ర‌ద‌ల‌కు కాళేశ్వ‌రం పంపులు పూర్తిగా మునిగిపోయాయని, దీన్ని బ‌ట్టే అర్థం అవుతోంది…. ఇది కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కాదు, క‌మీష‌న్ల ప్రాజెక్ట్ అని అంటూ విజయశాంతి సెటైర్లు వేశారు. కేసీఆర్… నువ్వు ఎన్ని రోజులు మ‌భ్యపెట్టినా… నీ అవినీతి గురించి ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా ఉండదంటూ ఆమె వ్యాఖ్యానించారు. త్వరలోనే తెలంగాణ స‌మాజ‌ం నీకు, నీ పార్టీకి త‌గిన రీతిలో గుణ‌పాఠం చెబుతుందన్నారు విజయశాంతి.

 

Exit mobile version