Site icon NTV Telugu

BJP VS TRS: ఢిల్లీలో బీజేపీ -టీఆర్‌ఎస్‌ పోస్టర్‌ వార్‌

Poster War

Poster War

తెలంగాణలో పండిన ప్రతి వడ్ల గింజనూ కేంద్రం కొనుగోలు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. ఇది విజయవంతం అయిందని ప్రకటించింది. ‘రైతుల పక్షాన ప్రజా ప్రతినిధుల నిరసన దీక్ష’ పేరుతో అక్కడి తెలంగాణ భవన్‌లో చేపట్టిన ఈ దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు 1,500 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ భారీ నిరసన దీక్షలో పాల్పంచుకున్నారు. ‘ఒకే దేశం-ఒకే ఆహారధాన్యాల సేకరణ విధానాన్ని’ అమలు చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రధానంగా డిమాండ్‌ చేస్తోంది.

ఇక, నిరసన దీక్షా వేదిక తెలంగాణ భవన్ దగ్గర టీఆర్‌ఎస్‌ పోస్టర్లకు పక్కనే బీజేపీ నేతలు పోటీగా పలు పోస్టర్లు ఏర్పాటు చేయటం ఆసక్తి కలిగిస్తోంది. కేసీఆర్‌ దిగిపోవాలంటూ ఆ పోస్టర్ల ద్వారా బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పోస్టర్‌పై ” కేసీఆర్.. బియ్యం సేకరించడంలో మీ సమస్య ఏమిటి. ఈ ధర్నా ఎందుకు? రాజకీయాల కోసమా ? రైతుల కోసమా? చేతనైతే బియ్యాన్ని కొను….లేదంటే దిగిపో అని రాసి ఉంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్, దాని పరిసర ప్రాంతాల్లో రెండు పార్టీల పోస్టర్లు భారీగా వెలిశాయి.

తెలంగాణ రాష్ట్ర సమితి ‘ఒక దేశం-ఒక ఆహార ధాన్యం సేకరణ విధానం’ డిమాండ్‌ను దేశవ్యాప్త ప్రధానాంశంగా మార్చాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. అందుకు ఈ నిరసన దీక్షను ఉపయోగించుకుంటున్నారనిపిస్తోంది. ఈ సమస్య మీద టీఆర్‌ఎస్‌ శ్రేణులు కొంత కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని నాలుగు జాతీయ రహదారులను ఆ పార్టీ కార్యకర్తలు దిగ్బంధించారు. ఇప్పుడు ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తే క్రమంలో ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టింది.

మార్చి 24న కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ రైతులకు వివిధ రాష్ట్రాల రైతుల మధ్య ఎలాంటి వివక్ష లేదని, తెలంగాణలోని కొందరు రాజకీయ నాయకులు రాష్ట్రంలోని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టం చేశారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న వరి ధాన్యాన్ని పూర్తిగా సేకరించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది.

ఢిల్లీలో నిరసన దీక్ష సందర్భంగా కేసీఆర్‌తో రైతు నేత రాకేశ్ టికాయత్ మాట్లాడారు. దీక్ష వేదిక వద్దకు వచ్చి కేసీఆర్‌ ఆందోళనకు టికాయత్ మద్దతు ప్రకటించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడిపించట్లేదని, కుట్రపూరిత ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు.

మరోవైపు, సీఎం కేసీఆర్ ఢిల్లీలో నిరసన దీక్షకు కౌంటర్ గా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో రైతు దీక్ష పేరుతో ధర్నా నిర్వహించారు. బండితో పాటు కేంద్ర మంత్రి వి. మురళీధరన్, డీకే అరుణ, విజయ శాంతి, ఈటెల రాజేందర్, రఘునందన్, రాజాసింగ్, పొంగులేటి సుధాకర్ తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ చెపుతున్నది కేసీఆర్‌ ఆరోపణలకు భిన్నంగా ఉంది. కేంద్రం ధాన్యం కొనడానికి సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం అంటోంది. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్‌ ధాన్యం కొనుగోలుపై అనవసరంగా రచ్చ చేస్తున్నారని బీజేపీ అంటోంది. ఎవరేమన్నా ..చివరకు ఈ సమస్య ఎలా పరిష్కారమవుతోంది చూడాల్సి వుంది.

Exit mobile version