NTV Telugu Site icon

Telangana BJP: తెలంగాణంలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ రె’ఢీ’.. వచ్చే నెలలో షెడ్యూల్ ఇదే..

Telangana Bjp

Telangana Bjp

Telangana BJP: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టి సారిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ పెండింగ్‌ ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తి చేస్తూ… నిరుపేదలకు విడతల వారీగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను అందజేస్తూ… ప్రజల్లో ఉండేలా ప్రయత్నిస్తోంది. ఇక.. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ బిజీబిజీగా ఉంది. ఇక… ఎన్నికల శంఖం పూరించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో… రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సభలు నిర్వహించాలని యోచిస్తోంది. వచ్చే నెల అంటే అక్టోబర్‌లో కమలం పార్టీ 30 నుంచి 40 సమావేశాలు నిర్వహించబోతోంది. ఆ సమావేశాలకు పార్టీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్నారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనలో ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించి వివరించాలని ప్లాన్ చేసింది. అంతేకాదు.. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించబోతున్నారు. బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేయనున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార సభలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ సభకు 17 లోక్‌సభ స్థానాలను కూడా కేటాయించాలని భావిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమం కోసం చేపట్టనున్న కార్యక్రమాలను ఈ సభల ద్వారా కమలం పార్టీ నేతలు వివరించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ తర్వాత ప్రచారంలో వేగం పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. అక్టోబరు 1న మహబూబ్‌నగర్‌ జిల్లాలో, 3న నిజామాబాద్‌లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా తెలంగాణ బీజేపీ కూడా బహిరంగ సభలు నిర్వహించింది. సభల ద్వారా ఎన్నికలను పూరించి ప్రచారంలో వేగం పెంచాలని మోదీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన అనంతరం… బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్టోబర్ 6న తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత… అక్టోబర్ 7న తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభను నిర్వహించబోతున్నారు తెలంగాణ బీజేపీ నేతలు.ఆదిలాబాద్ లో సభ నిర్వహించే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇలా… పార్టీ జాతీయ నేతలను తెలంగాణకు ఆహ్వానించి… వచ్చే ఎన్నికల ప్రచారంలో భాగస్వాములను చేయనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణలో పర్యటించేలా తెలంగాణ బీజేపీ ప్లాన్ చేస్తోంది.
Suryapet: దారుణం.. గురుకుల హాస్టల్‌లో ఉరికి వేలాడుతూ కనిపించిన విద్యార్థి..!

Show comments