NTV Telugu Site icon

Praja Sangrama Yatra: మూడో విడతకు ముహూర్తం.. మునుపటి కంటే భారీగా..

Praja Sangrama Yatra 3rd Ph

Praja Sangrama Yatra 3rd Ph

BJP Praja Sangrama Yatra To Start From August 2: ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రారంభం కానుందని బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ గంగిడి మనోహర్ రెడ్డి తెలిపారు. అప్పట్నుంచి 24 రోజుల పాటు సాగనున్న ఈ యాత్రకు పూర్తి భద్రత కల్పించాల్సిందిగా తాము డీజీపీని కోరామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన గడ్డపై మూడో విడత పాదయాత్ర జరుగుతుందని, ఈ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. చేనేత దినోత్సవమైన ఆగస్టు 7వ తేదీన భూదాన్ పోచంపల్లిలో పాదయాత్ర నడుస్తుందని.. గుండ్రామ్ పల్లి, ఖిలాషాపూర్ మీదుగా ఈ యాత్ర సాగుతుందని పేర్కొన్నారు. పాదయాత్ర మధ్యలో కేంద్ర మంత్రులు సహా బిజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా రానున్నట్టు మనోహర్ రెడ్డి వెల్లడించారు.

ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ మూడో విడత పాదయాత్ర జరుగుతుందన్నారు. ఆగస్టు 26న భద్రకాళి ఆలయం దర్శనం తరువాత బహిరంగ సభ నిర్వహించనున్నామని.. ఆ సభతోనే ఈ యాత్ర ముగుస్తుందని స్పష్టం చేశారు. రెండు విడతల పాదయాత్రను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు.. మూడో విడతను అంతే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మూడో విడత యాత్రను గత రెండు విడతల కంటే భారీఎత్తున నిర్వహించబోతున్నామని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల ప్రజలను ఈ పాదయాత్రలో భాగస్వామ్యం చేస్తామన్నారు. రేపు జరగనున్న పాదయాత్ర నిర్వహణ కమిటీలో బండి సంజయ్ కుమార్ సమావేశం అవుతారన్నారు. పాదయాత్ర విజయవంతం చేయాలని అరె మైసమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించామని ప్రదీప్ కుమార్ చెప్పారు.

Show comments