మీకు నిజాయితీ ఉంటే అక్రమంగా చేపట్టిన ఆర్డీఎస్ పనులను ఆపండి అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆర్డీఎస్ పై అవగాహన లేని బచ్చాగాళ్లు ముఖ్యమంత్రి రాసిచ్చిన కాగితాలు చూసి మాట్లాడుతున్నారు. ఆంధ్రవాళ్లు ఆంధ్రవాళ్లు అని విమర్శించే వారు రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నది మీ ముఖ్యమంత్రి గాదా అని ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరులో ప్రాజెక్టుల సాధన.. నా కృషి వలనే అన్నది ముందు తెలుసుకోండి అన్నారు. నేను పాలమూరు కోసం చేసిన కృషి మీకేం తెలుసు… ఏడేళ్లుగా జల దోపిడిని అడ్డుకోలేని వారు..ఇవాళ కేవలం హుజురాబాద్ ఎన్నికలు ఉన్నాయని జల దోపిడీ గురించి మాట్లాడి, కేవలం ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు అని తెలిపారు.
పాలమూరు నీళ్ల పేరు చెప్పుకుని ఉద్యమాన్ని నడిపించి పాలమూరు ప్రజలను మోసం చేసిన ఘనుడు కేసిఆర్. పాలమూరు జిల్లా కోసం మాట్లాడే నైతిక హక్కు టిఆర్ ఎస్ నాయకులకు లేదు. కృష్ణ జలాలు పెద్ద ఎత్తున వృధా అవుతున్నా దాని గురించి మాట్లాడరు..గత ప్రభుత్వాల మీద నిందలు వేస్తూ ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తూ పరిపాలన సాగిస్తారు. మీ డ్రామాలు ఆపి ముందు ఆంధ్రప్రదేశ్ కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఆపండి అని పేర్కొన్నారు.