తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ పాదయాత్ర ముగింపు సభను ఈనెల 14న మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో నిర్వహించనున్నారు. అయితే.. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్న నేపథ్యంలో ఈ భారీ బహిరంగ సభకు.. బీజేపీ శ్రేణులు అన్ని జిల్లాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. అంతేకాకుండా… అమిత్ షా తెలంగాణ పర్యటనపై టీఆర్‌ఎస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న క్రమంలో.. బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. అమిత్ షా రాక టీఆర్ఎస్‌లో కాక పుట్టిస్తుందన్నారు. టీఆర్‌ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, అందరి పాలన చూశారు.. ఒక్క సారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అని కోరుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు.
స్వచ్ఛ, నీతి వంతమైన పాలన, అవినీతిరహిత పాలన అందిస్తామనే భరోసా అమిత్ షా ఇవ్వబోతున్నారని, రాష్ట్రం దివాలా తీస్తుంది.. అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయిందని ఆరోపించారు లక్ష్మణ్. తెలంగాణ బడ్జెట్ మేడిపండు లాంటిది… డొల్ల తనం ఇప్పుడు బయట పడుతుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తన చేత కాని తనాన్ని కేంద్రంపై మోపుతోందన్నారు. అంతేకాకుండా కేటీఆర్ ట్విట్టర్ పిట్ట కూని రాగాలు తీస్తూ అబద్ధాలు మాట్లాడుతుందన్న లక్ష్మణ్.. కాంగ్రెస్ వచ్చేది లేదు చచ్చేది లేదు… ఎన్ని హామీలు ఇస్తే లాభం ఏంటి అని ఆయన ఎద్దేవా చేశారు. సబితా ఇంద్రరెడ్డి పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేస్తే ప్రజల కష్టాలు తెలుస్తాయని సూచించారు లక్ష్మణ్.