తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టిసారించింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు నేతలు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా నిర్వహించి అందరి దృష్టిని ఆర్షించారు.. వివిధ నియోజకవర్గాల్లో దిగిపోయిన ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకత్వం.. క్యాడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేశారు.. ఇక, పరేడ్ గ్రౌండ్ వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభతో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధిష్టానం నుంచి అభినందనలు అందుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఇదే సమయంలో.. రాష్ట్ర పార్టీ నేతలకు అమిత్‌షా వార్నింగ్ కూడా ఇచ్చారని వార్తలు వచ్చాయి.. విభేదాలను పక్కనబెట్టి.. పార్టీలోకి వచ్చేవారిని ఆహ్వానించాలని.. ఎవరు అడ్డుపడ్డా సీరియస్‌గా తీసుకుంటామని హెచ్చరించారట.. అయితే, అదే ఊపును కొనసాగించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలకు గాలం వేసే పనిలో పడిపోయింది.. కానీ, ఎవ్వరినిపడితే వారిని కూడా పార్టీలో చేర్చుకోవద్దనే సంకేతాలు అధిష్టానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
Read Also: Commitment: బూతు డైలాగ్స్ తో కమిట్ అవుదామంటున్న తెలుగమ్మాయి.. కేసు నమోదు
తెలంగాణలో బీజేపీ అధిష్టానం సర్వేలు నిర్వహిస్తోంది.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం వేట ప్రారంభించింది.. సర్వేల ఆధారంగా నేతలకు గాలం వేస్తున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు.. సర్వేల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారట కమలం పార్టీ నేతలు.. మొత్తంగా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం ఎంతగానో ప్రయత్నం చేస్తుంది.. గతంతో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీ బలపడింది.. అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరే స్థాయికి వెళ్లింది.. ఓవైపు కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా ఉన్నా.. మేము సైతం అనే తరహాలో బీజేపీ దూకుడు చూపిస్తోంది.. కానీ, పార్టీలో చేరికల విషయంలో మాత్రం కాంగ్రెస్ దూకుడుగా ఉంటే.. బీజేపీ వెనుకబడిందనే విమర్శలు ఉన్నాయి.. దీనికోసమే ప్రత్యేకంగా చేరికల కమిటీ కన్వీనర్ గా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ను నియమించింది అధిష్టాం.. ఇప్పుడు సర్వేల ఆధారంలో ఆయా జిల్లాల్లో నేతలకు గాలం వేసే పనిలో పడిపోయారు కమలనాథులు.
కొన్ని ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలు చురుకుగా నిర్వహిస్తున్నారు నేతలు.. మరికొన్ని చోట్ల ఏదో మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారట.. దీంతో ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ , పార్టీ నాయకుల పనితీరుతో పాటు, బీజేపీకి తెలంగాణలో విజయ అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి? అనే దానిపై దృష్టిసారించింది అధినాయకత్వం.. దాని కోసమే సర్వేలు నిర్వహిస్తోంది.. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో బీజేపీ శ్రేణులు ఏ విధంగా పనిచేస్తే బాగుంటుందనే విషయంలోనూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు.. ఆయా నియోజకవర్గాల్లో తమ బలంతో పాటు.. తమ రాజకీయ ప్రత్యర్థుల బలాబలాలు ఏమిటి అనే అంశంపై కూడా ఆ సర్వేలతో బీజేపీ అధిష్టానం ఆరా తీస్తోందట. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మరి కొందరు నేతలు పార్టీకోసం శ్రమిస్తున్నా.. జిల్లా పార్టీ ఇన్చార్జీలు , నియోజకవర్గ స్థాయి నాయకుల పనితీరు అంతంతమాత్రమే ఉందని కేంద్ర నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.. పార్టీలో చేరికలు, కొత్తవారు రావడం.. పాతవారితో సయోద్య లేకపోవడం కూడా మైనస్‌గా మారడంతో.. విభేదాలను పక్కనబెట్టి బలమైన నేతలను పార్టీలోకి తీసుకోవాలని అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.