అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే.. ఇరు పార్టీలు తెలంగాణలో ఎన్నికల తరహా వాతావరణాన్ని తీసుకువచ్చాయి. తాజాగా తెలంగాణ ఏర్పాటు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ డెవలఫ్మెంట్ కు కేంద్రం మోకాలడ్డు పెడుతుందని టీఆర్ఎస్ అంటుంటే.. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కప్పగా మార్చారంటూ బీజేపీ ఫైర్ అవుతోంది.
ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ను విమర్శించారు. మూర్ఖపు ముఖ్యమంత్రిని టీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని అన్నారు. నిజమైన ఉద్యమకారులు ఉన్న పార్టీ బీజేపే అని ఆయన తెలిపార. ఛత్రపతి శివాజీ,చాకలి ఐలమ్మను ఎవరూ చూడలేదు.. కానీ ఉద్యమకారుల రూపంలో వారిని మనం చూస్తున్నామని బండి సంజయ్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా ఉద్యమ ద్రోహులే అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
తెలంగాణ ప్రజలు తెలంగాణ ఎందుకు సాధించామా..అని బాధపడుతున్నారని దానికి కారణం కేసీఆరే అని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆత్మహత్యలు ఆగలేని అన్నారు. ఇంటర్ విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని బండి విమర్శలు గుప్పించారు. ప్రజల తరుపున మరో ఉద్యమం చేస్తాం.. అదే చివరి ఉద్యమం కావాలని అన్నారు. ప్రజలు తరుపున బీజేపీ పోరాడుతుందని.. శక్తివంతమైన తెలంగాణను నిర్మిస్తామని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ బీజేపీ అని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన తెలంగాణ ఉద్యమకారులు ఆదే స్ఫూర్తితో ముందుకు సాగుదాం.. పోరాడుదాం అని పిలుపునిచ్చారు.
