బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!

  • బీబీనగర్ వద్ద సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
  • బ్రేక్ లైనర్ రాపిడితో పొగలు, మంటలు
  • అప్రమత్తమైన కో-పైలట్.. అత్యవసరంగా రైలు నిలిపివేత
  • ఫైర్ సిబ్బంది, రైల్వే సిబ్బంది చర్యలతో తప్పిన ప్రమాదం
Sirpur Kagaznagar Train

Sirpur Kagaznagar Train

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ సమీపంలో బుధవారం రోజున సిర్పూర్-కాగజ్‌నగర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగజ్‌నగర్ వైపు వెళ్తున్న ఈ రైలు బీబీనగర్ స్టేషన్ దాటుతున్న సమయంలో హఠాత్తుగా పొగలు, మంటలు వ్యాపించాయి. ప్రయాణికులు భయంతో కేకలు వేయడంతో రైలులో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

అలర్ట్ చేసిన కో-పైలట్.. నిలిచిపోయిన రైలు

రైలు చక్రానికి బ్రేక్ లైనర్ గట్టిగా ఒరుసుకుపోవడంతో తీవ్రమైన ఘర్షణ ఏర్పడి, పొగలతో పాటు మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ సాంకేతిక సమస్యను వెంటనే గమనించిన కో-పైలట్ క్షణాల్లో అప్రమత్తమై లోకో పైలట్‌ను హెచ్చరించారు. దీంతో సమయస్ఫూర్తితో స్పందించిన లోకో పైలట్ వెంటనే రైలును అత్యవసరంగా నిలిపివేశారు. రైలు ఆగడంతో ప్రయాణికులు వేగంగా కిందకు దిగిపోయారు.

మంటలను అదుపు చేసిన ఫైర్ ఇంజన్లు

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆర్పివేత చర్యలు ప్రారంభించాయి. ఫైర్ సిబ్బంది , రైల్వే సిబ్బంది సంయుక్తంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో స్పందించి ప్రమాదాన్ని అదుపు చేయడంతో ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం కానీ సంభవించలేదు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.