Site icon NTV Telugu

Bhatti Vikramarka : తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేది లేదు..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గురించి కొన్ని వర్గాలు చేస్తున్న విమర్శలు పూర్తిగా నిరాధారమని తేల్చిచెప్పారు. ప్రభుత్వంలో ఎలాంటి అంతర్గత కలహాలు లేవని, పవర్ షేరింగ్ వంటి అంశాలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం బలంగా, సమిష్టిగా పని చేస్తోందని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అన్ని శాఖల మంత్రులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని వెల్లడించారు.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు మితిమీరినవని, వారి మాటలకు మౌలికత లేదని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని, ప్రజాప్రతినిధిగా ఇది అతని బాధ్యత కింద వస్తుందని అన్నారు. గత పాలనను తాము విమర్శించడం సహజమేనని, కానీ ప్రస్తుతం ప్రజలకు అవసరమైన సంక్షేమాన్ని అందించడమే తమ ధ్యేయమని తెలిపారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీ “జాతకం” అంతేనా, ఆ యోగం లేనట్లేనా..

తాము అధికారంలోకి వచ్చిన తరువాత 100 శాతం రుణమాఫీ అమలు చేశామని, రైతులకు ‘రైతు భరోసా’ అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిధిని ₹10 లక్షల వరకు పెంచి, ఆరోగ్య పరిరక్షణలో మరో మెట్టు ఎక్కామని తెలిపారు. పేదల కోసం ఇళ్లు నిర్మిస్తున్నామని, 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు. అలాగే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ₹500కే గ్యాస్ సిలిండర్ అందించడం, విజయవంతంగా అమలవుతున్న “సన్నం బియ్యం” పథకం వంటి కార్యక్రమాలను గుర్తు చేశారు.

అభివృద్ధి ప్రాజెక్టుల పరంగా మాట్లాడుతూ, ఫోర్త్ సిటీ పనులు కొనసాగుతున్నాయని, మూసి నది సుందరీకరణ ప్రాజెక్ట్ తమ ప్రభుత్వ హయంలోనే పూర్తి కానుందని అన్నారు. అలాగే రీజినల్ రింగ్ రోడ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలియజేశారు. సిగాచి ప్రమాదంపై విచారణకు అధికారులను ఆదేశించామని, బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర నాయకుడు కేసీ వేణుగోపాల్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణలో “డబుల్ ఇంజన్” ప్రభుత్వం అనే బీజేపీ కలలు కలలు గానే మిగిలిపోతాయని, ప్రజలు నిజమైన సంక్షేమ పాలనకు మద్దతు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.

Junior : ఆసక్తికరంగా జూనియర్ ట్రైలర్

Exit mobile version