NTV Telugu Site icon

Bhatti Vikramarka: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka Speech In Sirikonda Corner Meeting: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అడ్డగోలుగా పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి, 500 రూపాయలకే ఇస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఇంటి స్థలాలు లేని పేదలకు స్థలాలు ఇవ్వడంతో పాటు ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో రెండో రోజు పాదయాత్రలో భాగంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది ప్రజల బాగు కోసమా? కెసిఆర్ కుటుంబం బాగుపడడం కోసమా? అని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని.. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం దక్కుతుందని పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. కానీ.. సీఎం కేసీఆర్ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా, ప్రజలను అగ్ని గుండంలో నెట్టివేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రజలకు ఇండ్లు, పోడు పట్టాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు వర్తింపజేసి.. ఉపాధి హామీ పని కల్పించామని గుర్తు చేశారు. తెలంగాణ వస్తే మరిన్ని మంచి పథకాలు వస్తాయని ఆశించిన ప్రజలకు.. ఉన్న పథకాలు తీసివేసి ప్రజలను కేసీఆర్ గోసపెడుతున్నారని ఆరోపించారు.

NTR30: ఎన్టీఆర్ 30 పూజకు గెస్ట్ గా చిరు.. నిజమైతే ఎంత బావుండు

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి అనేక మాయమాటలు చెప్పిన సీఎం కేసీఆర్.. హౌజింగ్ శాఖను ఎత్తివేసి ప్రజలను దగా చేశారని భట్టి విక్రమార్క ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి.. పోడు భూముల పట్టాలు పంపిణీ చేయకుండా, గిరిజనులను వేధించి కేసులు పెట్టడానికేనా తెలంగాణ తెచ్చుకుంది? అని నిలదీశారు. గిరిజన బిడ్డల బతుకులు బాగుకోసమే సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందని.. కేసీఆర్ కుటుంబం బాగుపడటం కోసం కాదని చెప్పారు. సిరికొండ మండలంలో ఉన్న గ్రామాల్లో తొమ్మిదింటిని ఒక నియోజకవర్గంలో, మిగతా గ్రామాలను మరొక నియోజకవర్గంలో కలపడం ఏంటి? అని ప్రశ్నించారు. ఒక మండలాన్ని రెండు నియోజకవర్గాలుగా విభజించడం తుగ్లక్ పాలన అని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన సిరికొండ మండలంలో ఆఫీసులు పెట్టకుండా పరిపాలన ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన చికుమన్ ప్రాజెక్టుకు కాలువలు తవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తోందని మండిపడ్డారు. బోథ్ నియోజకవర్గంలోని మూడు, నాలుగు మండలాలకు సాగునీరు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కుప్టి ప్రాజెక్టు కట్టాలని ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. అయితే.. అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అవుతున్నా.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు.

IND vs AUS 1st ODI: కేఎల్ రాహుల్ ఒంటరి పోరు.. ఆస్ట్రేలియాపై భారత్ గెలుపు

మనకు సాగునీరు ఇవ్వని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని.. మీ సమస్యల్ని పరిష్కరించడం కోసమే ఈ పాదయాత్ర మొదలుపెట్టానని ప్రజల్ని ఉద్దేశించి భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రకు వెళ్లిన వారికి సంక్షేమ పథకాలు ఆపివేస్తామని అనడానికి మీరెవరు? రాష్ట్ర సంపద ఏమైనా మీ అబ్బ సొత్తా? అంటూ బీఆర్ఎస్ నాయకుల బెదిరింపులపై మండిపడ్డారు. తెలంగాణలో దొరల పాలన వద్దని, ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్‌తోనే సాధ్యం అవుతుందని.. కాంగ్రెస్‌ని గెలిపించుకొని పీపుల్స్ గవర్నమెంట్ తెచ్చుకుందామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. బోథ్ నియోజకవర్గం సస్యశ్యామలం చేయడానికి కుప్టి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తామన్నారు. చీకుమన్ ప్రాజెక్టు ఎత్తు పెంచి, గేట్లు ఏర్పాటు చేసి దిగువ ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. సిరికొండలో షాదీఖాన నిర్మాణానికి కూడా హామీ ఇస్తున్నానని భట్టి విక్రమార్క వెల్లడించారు.