తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు కోరారు. శనివారం నాడు న్యూఢిల్లీలోని అశోకా హోటల్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ‘ప్రి-బడ్జెట్’ సమావేశంలో ఆయన పాల్గొని తెలంగాణ ప్రభుత్వ విన్నపాలను కేంద్రం ముందుంచారు. 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని, అందుకు అనుగుణంగా రాష్ట్ర మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.1 శాతంగా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ ద్వారా దీనిని 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని భట్టి వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం ఉన్న 200 బిలియన్ డాలర్ల నుండి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందుకు రాష్ట్రాల ద్రవ్య లోటు (Fiscal Deficit) పరిమితిని ప్రస్తుతం ఉన్న దానికంటే 4 శాతానికి పెంచాలని ఆయన కేంద్రానికి సూచించారు. అలాగే, విద్య , ఆరోగ్య రంగాల కోసం సేకరించే వనరులను FRBM పరిమితుల నుండి మినహాయించాలని కోరారు.
రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని భట్టి విక్రమార్క కోరారు. అందులో ముఖ్యమైనవి.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల: ఈ పథకాన్ని వెంటనే ‘జాతీయ ప్రాజెక్టు’గా గుర్తించి నిధులు కేటాయించాలి. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 కు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని, ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని కోరారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కోసం రూ. 14,100 కోట్లు, రేడియల్ రోడ్ల కోసం రూ. 45,000 కోట్లు, , మురుగునీటి పారుదల ప్రణాళిక కోసం రూ. 17,212 కోట్లు కేటాయించాలని విన్నవించారు.
తెలంగాణలో విద్యారంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ.. 119 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను’ ఆయన ప్రస్తావించారు. హైదరాబాద్‌లో ఐఐఎం (IIM) ఏర్పాటును ప్రకటించాలని, అలాగే అన్ని జిల్లాల్లో కేంద్రీయ , జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరారు. రవాణా పరంగా పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర పన్నుల పంపిణీలో రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని భట్టి విక్రమార్క ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించారు. సెస్‌లు, సర్‌ఛార్జీల వల్ల రాష్ట్రాలకు అందాల్సిన 41 శాతం వాటా కాస్తా 30 శాతానికే పరిమితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ. 1.55 లక్షల కోట్ల సర్‌ఛార్జీలను మౌలిక సదుపాయాల నిధికి మళ్లించాలని లేదా వాటిని ప్రాథమిక పన్నుల్లో కలిపి రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకుంటున్న 50 ఏళ్ల వడ్డీ లేని రుణాలను గ్రాంట్లుగా మార్చాలని ఆయన కోరారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం తెలంగాణ అభ్యర్థనలను సానుకూలంగా పరిశీలిస్తుందని ఆశిస్తున్నట్లు భట్టి విక్రమార్క తన ప్రసంగాన్ని ముగించారు.
Deputy CM Pawan Kalyan: మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూసే శక్తులతో జాగ్రత్త.. పవన్ కీలక సూచనలు..
