Bhatti Vikramarka : తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించే అంశంపై ప్రభుత్వం చాలా బలంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో మీడియాతో నిర్వహించిన ప్రత్యేక చిట్‌చాట్‌లో ఆయన ప్రభుత్వ పథకాలు, రాజకీయ పరిణామాలు , ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జర్నలిస్టుల ఇళ్ల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా అధికారులు పనిచేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ పథకం అత్యంత అద్భుతంగా నడుస్తోందని, ప్రజలందరూ ఈ ఉచిత వైద్య సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఈ పథకం సజావుగా సాగడం కోసం ప్రభుత్వం ప్రతి నెలా ₹150 కోట్ల నిధులను కేటాయిస్తోందని వెల్లడించారు. ఈ పథకం ద్వారా పేదలకు ₹10 లక్షల వరకు వైద్య బీమా కవరేజ్ లభిస్తుందని, ప్రభుత్వంలో పూర్తి బాధ్యతాయుతమైన విధివిధానాలు ఉన్నాయని చెప్పారు. వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి వీలుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో కొత్తగా 10 వేల బెడ్‌లను పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రస్తుత తెలంగాణ మంత్రివర్గం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక టీమ్‌లా అద్భుతంగా పనిచేస్తోందని డిప్యూటీ సీఎం కొనియాడారు. అందరి లక్ష్యం తెలంగాణ అభివృద్ధి మాత్రమేనని, క్షేత్రస్థాయిలో పనిచేసే పార్టీలకు ఎలాంటి ఆర్భాటపు ప్రచారాలు అవసరం లేదని, ప్రజలకు సేవ చేయడమే తమ మొదటి ప్రాధాన్యతని స్పష్టం చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ , మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకుందని గుర్తు చేస్తూ.. ప్రస్తుత ప్రభుత్వ పాలనకు తాను వంద శాతం మార్కులు వేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇదే ఊపుతో రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికలపై కూడా ప్రభుత్వం త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటుందని, 2028 లో జరిగే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ప్రత్యర్థులే ఎవరూ లేరని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంట్ మీటర్లు పెట్టబోమని, ఉచిత కరెంట్ అందించి తీరుతామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు నోరు మెదపకపోవడమే భవిష్యత్తులో తమ విజయానికి నిదర్శనమని భట్టి విక్రమార్క అన్నారు. అలాగే, సమాజంలో ఓట్ల గల్లంతు వ్యవహారంపై మీడియా ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఓటర్ల మ్యాపింగ్ , అన్-మ్యాపింగ్ ప్రక్రియలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ‘ఇందిరమ్మ జీవిత బీమా పథకం’ రాష్ట్రంలోని లబ్ధిదారులందరికీ ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని భరోసా ఇచ్చారు.
ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపై భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వమని ధ్వజమెత్తారు. దేశంలో మొదటి నుండి గోదాములలో స్టాక్ ఉంచడం నేరమైనప్పటికీ, బీజేపీ ప్రభుత్వం మాత్రం అదానీ, అంబానీ లాంటి పెద్ద కార్పొరేట్ సంస్థలకు గోదాములు పెట్టుకునేలా లబ్ధి చేకూర్చిందని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నేతలు ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం మానేసి.. కేంద్రం ద్వారా ముందుగా ధాన్యం కొనుగోళ్లు జరిగేలా చూడాలని, ఆ తర్వాతే ఇతర విషయాల గురించి మాట్లాడాలని డిప్యూటీ సీఎం గట్టిగా హితవు పలికారు.
