Site icon NTV Telugu

Bhatti Vikramarka: బీజేపీ, టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తున్నాయి

Bhatti Vikramarka Fires

Bhatti Vikramarka Fires

Bhatti Vikramarka Fires On TRS BJP Parties: అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సామాన్యుడికి ఓటు హక్కు కల్పిస్తే.. ఆ రెండు పార్టీలు మాత్రం సామాన్యుల ఆర్థిక పరిస్థితిని ఆసరా చేసుకొని ప్రలోభపెడుతున్నాయని ఆగ్రహించారు. అసలు వారి వద్ద వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఇతర ఎమ్మెల్యేల లాగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కోట్లు పోగేసుకున్న వ్యక్తి కాదని.. ఆ విలువలు ఉన్న పాల్వాయి స్రవంతిని గెలిపించాలని మునుగోడు నియోజకవర్గ ప్రజల్ని కోరారు. వెలకట్టలేని మీ ఓటును.. వెలకట్టి అమ్ముకోవాలనుకున్న రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు.

బీజేపీకి సంబంధించిన కొందరు వ్యక్తులు, ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రలోభ పెట్టారనే వార్తలు విన్నామని.. ఇప్పుడు గగ్గోలు పెడుతున్న టీఆర్ఎస్ పార్టీకి ఇది కొత్త కాదని భట్టి విక్రమార్క చెప్పారు. మధ్యప్రదేశ్‌లో గానీ, కర్ణాటకలో గానీ.. బీజేపీ ఇతర ప్రజా ప్రతినిధుల్ని కొనలేదా? ఇటు టీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనలేదా? అని నిలదీశారు. ఇది ఎవరి కుట్రనో అందరికీ తెలుసని.. రెండు పార్టీలూ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేల వరకు కొనుగోలు చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. నలుగురా? 40 మందా? అనేది పక్కన పెడితే.. వందల కోట్లు ఖర్చు పెడుతున్న వారి వద్దకు, అంత డబ్బు ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల కోసం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు భారీ డబ్బులు ఖర్చు చేస్తున్నాయని ఆరోపణలు చేశారు.

ఇదే సమయంలో బండి సంజయ్‌పై కూడా భట్టి విక్రమార్క విరుచుకుపడ్డారు. అభివృద్ధి గురించి మాట్లాడుతున్న బండి సంజయ్.. ఇంతవరకు ఏం అభివృద్ధి చేశారు? కంపెనీలు పెట్టారా? ప్రభుత్వ రంగ సంస్థల్ని స్థాపించారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కేవలం మతం పేరుతో రెచ్చగొట్టి, రాజకీయ లాభం పొందెందుకు బండి సంజయ్ ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్క ఈ స్థానంతో ఏ ప్రభుత్వమూ పడిపోందని, ఇంత విచ్చల విడితనం ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని భట్టి విక్రమార్క తెలిపారు.

Exit mobile version