Site icon NTV Telugu

Bhatti Vikramarka : పాత పాపాలు.. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై భట్టి కీలక వ్యాఖ్యలు.!

Bhatti

Bhatti

Bhatti Vikramarka : పేద విద్యార్థుల భవిష్యత్తుకే ప్రాధాన్యత: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, పేద విద్యార్థుల భవిష్యత్తుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని చిన్నాభిన్నం చేసి, బకాయిల భారాన్ని తమపై మోపిందని ఆరోపించారు.

“ఆ విచ్ఛిన్నాన్ని సరిదిద్దుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది” అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న బకాయిల నుండి రూ. 600 కోట్లు త్వరితగతిన విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మిగిలిన బకాయిలను ప్రతినెలా కొంత చొప్పున చెల్లిస్తూ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయానికి యాజమాన్యాలు సానుకూలంగా స్పందించి బంద్‌ను విరమించాయని తెలిపారు.

NTR – Rishab Shetty: రిషబ్ శెట్టి సినిమాలో ఎన్టీఆర్?

చర్చల సందర్భంగా, కళాశాల యాజమాన్యాలు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరగా, ప్రభుత్వం అందుకు అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కళాశాల యాజమాన్యాల ప్రతినిధులతో కలిసి ఈ కమిటీని ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. అయితే.. కళాశాల యాజమాన్యాల సంఘాల సమాఖ్య అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ, “పాత ప్రభుత్వం చేసిన పాపాలు మా నెత్తిన బడినప్పటికీ, మా యందు దయతలచి రూ. 600 కోట్లు విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు” అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో విద్యార్థులకు, కళాశాలలకు కొంత ఊరట లభించింది. భవిష్యత్తులో ఈ సమస్య పూర్తిగా పరిష్కారమై విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా విద్యాభ్యాసం కొనసాగుతుందని ఆశిద్దాం.

Manchu Lakshmi : ఆ హీరో మాజీ భార్యకు కావాలనే ఛాన్సులు ఇవ్వట్లేదు..

Exit mobile version