NTV Telugu Site icon

Bhatti Vikramarka : అగ్నిపథ్‌ను తక్షణమే విరమించుకోవాలి

Bhatti Vikramarka

Bhatti Vikramarka

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలనే డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు మధిర నియోజక వర్గ కేంద్రంలోని ఆర్వి కాంప్లెక్స్ ఎదురుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన వెల్లడించారు. బీజేపీ తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకం దేశ ప్రజల రక్షణ కోసం తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆర్ఎస్ఎస్ వ్యక్తులను భారత రక్షణ రంగంలో పంపటం కోసమే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకొచ్చిందని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలవల్లే నిరుద్యోగులను ఆందోళన వైపు పురిగొల్పుతున్నాయన్నారు. రక్షణ రంగంలో కాంట్రాక్ట్ పద్ధతి ఉద్యోగాలు ఇవ్వటం దేశ రక్షణకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీ నిర్ణయాల వల్ల దేశంలో యువత హింస వైపు అడుగులు వేస్తోందని, ప్రభుత్వరంగ సంస్థలు అమ్మటం అంటే భారతదేశాన్ని అమ్మటమేనని ఆయన ఆరోపించారు. యువతకు ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలను బహుళజాతి సంస్థల అధిపతులు అయిన అంబానీ ఆదానీలకు దారాదత్తం చేస్తూ ఉన్న ఉద్యోగాలను కొల్ల గొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరూ కలిసి దేశాన్ని ఆదానీ, అంబానీ లకు అమ్ముతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ వ్యతిరేకించాలన్న భట్టి.. గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ శాంతియుతంగా సత్యాగ్రహం చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను అభినందించారు.