NTV Telugu Site icon

Bharat Ratna PV Narasimha Rao: దివంగత ప్రధాని పీవీ కి భారత రత్న.. హర్షం వ్యక్తం చేసిన నేతలు

Pv Narasimha Rao

Pv Narasimha Rao

Bharat Ratna PV Narasimha Rao: కుప్పకూల బోతున్న భారత ఆర్థిక వ్యవస్థను తన ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ ద్వారా ప్రపంచంలోనే ఆర్థికంగా బలమైన దేశంగా భారత్ ను రూపొందించడంలో మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు తన చివరి శ్వాస వరకు శ్రమించారని తెలంగాణ రాష్ట్రం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పి.వి నర్సింహ్మ రావు వేసిన ఆర్థిక సంస్కరణల పునాదుల ఫలంగానే నేడు భారతదేశం ప్రపంచంలోనే ఆర్థికంగా నాలుగవ బలవంతమైన దేశంగా రూపుదిద్దుకుందన్నారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వర్గీయ పీవీ నరసింహారావు గారికి భారతరత్న దక్కడం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా భావిస్తున్నామన్నారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన దివంగత ప్రధాని పీవీ కి భారత రత్న ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాన్ని సుదీర్ఘకాలం తర్వాత గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలన్నారు.

తెలంగాణ ప్రియతమ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అరుదైన గౌరవం దక్కింది. భారతరత్న దేశ అత్యున్నత పౌర పురస్కారం. పీవీ నర్సింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు కూడా కేంద్రం శుక్రవారం భారతరత్న అవార్డును ప్రదానం చేసింది. దీంతో అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పీవీకి భారతరత్న ప్రకటించడంపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం. పీవీకి భారతరత్న ప్రకటించాలన్న బీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్‌ను గౌరవించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

భారత పూర్వ ప్రధాని పీవీ నరసింహారావుకి.. భారతరత్న ప్రకటించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రఖర జాతీయవాది, రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారు భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారత రత్నకు ఎంపికవడం దేశ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. దూరదృష్టి గల నాయకుడిగా భారతదేశానికి వివిధ హోదాల్లో వారు చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా దేశంకోసం,దేశాభివృద్ధి కోసం వారు చేసిన సేవలు చిరస్మరణీయం.మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి హోదాలో.. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ పురోగతికి వారు పునాదులు వేశారన్నారు. భారతదేశంలోకి ప్రపంచ మార్కెట్‌ను ప్రోత్సహించడం ద్వారా వేశారు. దీంతోపాటుగా భారతదేశ విదేశాంగ విధానంలో, విద్యారంగంలో ప్రత్యక్షంగా వారు తీసుకున్న నిర్ణయాలు దేశానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. చాణక్యుడిగా రాజకీయ చతురతతో దేశాన్ని ముందుకు నడిపించడంతోపాటుగా.. రచయితగా,సాహితీవేత్తగా, తెలంగాణ స్వాతంత్ర్య కోసం నిజాంపై పోరాడిన పోరాట యోధుడిగా.. ఇలా ప్రతిఅడుగులోనూ శ్రీ పీవీ నరసింహారావు గారి జీవితం మనందరికీ ఆదర్శనీయమని తెలిపారు.

తెలుగు ఠీవీ… పీవీకి భారతరత్న భేష్ అని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలుగు ప్రజలకు ప్రత్యేకించి తెలంగాణకు దక్కిన గౌరవమిదన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డకు అత్యున్నత పురస్కారం లభించడం ఆ జిల్లావాసిగా గర్వపడుతున్నా అన్నారు. దేశం కోసం ఎంతో సేవ చేసిన పీవీ నర్సింహారావును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని తెలిపారు. పీవీని కేవలం రాజకీయ లబ్దికే వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ ది అన్నారు. రాజకీయాలకు అతీతంగా దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తించి దేశ అత్యున్నత పురస్కారం అందించిన మోదీ ప్రభుత్వానికి ధన్యవాదములన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉత్సవాలు నిర్వహించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిస్తున్నా అన్నారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ లకు భారతరత్న పురస్కారం సముచిత నిర్ణయమని తెలిపారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి భారతరత్న అవార్డు ను కేంద్ర ప్రకటించడం సంతోషదాయకమని డీకే అరుణ అన్నారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. విశిష్ట పండితుడు, బహుభాషా కోవిదుడు,రాజనీతిజ్ఞుడిగా, నరసింహారావు గారు భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా అనేక సంవత్సరాల పాటు పార్లమెంటు, శాసనసభ సభ్యునిగా ప్రజలకు ఎనలేని సేవలు చేశారన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ను పటిష్టం చేయడంలో పీవీ నరసింహా రావు కీలకపాత్ర పోషించారన్నారు. దేశం యొక్క శ్రేయస్సు మరియు అభివృద్ధికి బలమైన పునాది వేసిన నాయకుడు పీవీ నరసింహారావని తెలిపారు. పీవీ నరసింహారావు కు భారతరత్న ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
Ravindra Jadeja: అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్లు పూర్తి.. రవీంద్ర జడేజా స్పెషల్ వీడియో వైరల్!