BC Reservation : హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులపై చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రపతిని వ్యక్తిగతంగా కలసి ఆమోదం పొందేందుకు వచ్చే నెల 5, 6, 7 ఆగస్టు తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్ళాలని తేల్చింది.
కేబినెట్ సమావేశం అనంతరం మంత్రివర్గం వివరాల ప్రకారం, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలోనే ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. ఆగస్టు 5న పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం ద్వారా బిల్లుల ఆమోదంలో జరుగుతున్న జాప్యానికి నిరసన తెలిపేందుకు పార్టీ ఎంపీలు సన్నద్ధం అవుతున్నారు. ఆగస్టు 6న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి “ఛలో ఢిల్లీ” కార్యక్రమం నిర్వహించి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. తరువాతి రోజు, 7 ఆగస్టు నాడు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 200 మంది ప్రతినిధులు రాష్ట్రపతిని కలసి బిల్లుల ఆమోదం కోరతారు.
S Jaishankar: ఆపరేషన్ సిందూర్‌కు ముందు ఏం జరిగిందంటే..!
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రాజకీయ ప్రాతినిథ్యం కల్పించే బిల్లుతో పాటు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే మరో బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే అసెంబ్లీ, కౌన్సిల్‌లో ఆమోదించింది. ఈ రెండు బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి పెండింగ్‌లో ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అంతరాయం కలుగుతుందని కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసింది. హైకోర్టు సూచనల మేరకు ఈ నెలాఖరులోపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయించింది.
మాజీ సీఎం కేసీఆర్ 2018లో పంచాయతీరాజ్ చట్టంలో ప్రవేశపెట్టిన 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ నిబంధన బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డుగా ఉందని కేబినెట్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆ చట్టాన్ని సవరించేందుకు జూలై 10న కేబినెట్ ఆర్డినెన్స్‌ను ఆమోదించి, జూలై 14న గవర్నర్‌కు పంపింది. ఆ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి ఆమోదానికి వెళ్ళినట్లు సమాచారం.
రవాణా శాఖకు సంబంధించి రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న 15 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను తొలగించేందుకు కేబినెట్ అంగీకరించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఆధునిక వాహన్ సాఫ్ట్‌వేర్, అడ్వాన్స్డ్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ నిర్వహించనున్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన చట్ట సవరణలు త్వరలో చేపట్టనున్నట్లు ప్రకటించింది.
UP: మసీదులో అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్ చర్చలు.. వస్త్రధారణపై దుమారం
