Telangana BJP Chief Bandi Sanjay Praja Sangrama Yatra 3rd Phase Start on August 2nd.
ప్రజాసంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు విడతలుగా తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇటీవల నిర్వహించిన రెండో విడత పాదయాత్ర ముగింపు సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరయ్యారు. అయితే గత కొద్దీ రోజులక్రితం బండి సంజయ్ త్వరలోనే మూడో దశ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. అన్నట్లుగా గత వారం రోజుల క్రితం మూడో దశ ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆగస్టు2న మూడో విడత పాదయాత్ర ప్రారంభించనున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. అయితే తాజాగా పాదయాత్ర వివరాలను బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 2న యాదగిరి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామికి పూజలు చేసిన తర్వాత బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభిస్తారు.
Telangana Floods : భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి
రోజుకు 15 కిలోమీటర్ల చొప్పున 20 రోజుల పాటు 300 కిలోమీటర్లు సాగుతుందని, ముందుగా భువనగిరి లోక్ సభ పరిధిలోని యాదగిరిగుట్ట (ఆలేరు అసెంబ్లీ)లో మొదలవుతుందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఇబ్రహీంపట్నం మినహా ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగాం అసెంబ్లీ పరిధిలోని ప్రాంతాలతో పాటు వరంగల్ లోక్‌సభ పరిధిలోని స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, హనుమకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. హన్మకొండ జిల్లాలోని భద్రకాళి టెంపుల్ వద్ద ఆగస్టు 21న ప్రజా సంగ్రామ యాత్ర ముగుస్తుంది. అయితే ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. ఇదిలా ఉంటే.. రూట్ కమిటీ ఫైనల్ మ్యాప్‌ను రెడీ చేసిన అనంతరం పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని బీజేపీ నేతలు తెలిపారు.
