NTV Telugu Site icon

15వ రోజుకు చేరిన ప్రజా సంగ్రామ యాత్ర..

భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.. ఇప్పటికే 14 రోజులు పూర్తి చేసుకున్న బండి పాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది.. ఇవాళ సంగారెడ్డిలోని సంగుపేట నుంచి చిట్కూల్ వరకు బండి సంజయ్‌ కుమార్‌ పాదయాత్ర కొనసాగనుంది.. ఇక, జోగిపేట్‌ మెయిన్‌ రోడ్‌.. హనుమాన్‌ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి బీజేపీ శ్రేణులు.. మరోవైపు, సంజయ్‌తో పాటు ఇవాళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తదితరులు పాదయాత్రలో పాల్గొననున్నారు. మొత్తంగా సంగుపేట్‌లోని శ్రీ లక్ష్మీ నర్సింహా గార్డెన్‌ నుంచి చిట్కూల్‌ లోని చాముండేశ్వరి ఆలయం వరకు పాదయాత్ర సాగనుంది.

మరోవైపు.. ఈ రోజు మధ్యాహ్నం జోగిపేటలో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, ముఖ్యనేతలు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జ్ ల సమావేశం జరగనుంది.. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, తరుణ్ చుగ్, విజయ శాంతి తదితరులు హాజరుకానున్నారు.. బండి సంజయ్ సంగ్రామ యాత్ర.. నిర్మల్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభ, హుజూరాబాద్ ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహించనున్నారు నేతలు.