NTV Telugu Site icon

మనం టెన్షన్ పడడం కాదు.. కేసీఆర్‌కు టెన్షన్ పెడదాం..!

ఇక నుంచి మనం టెన్షన్ పడడం కాదు.. సీఎం కేసీఆర్‌కు టెన్షన్‌ పెడదాం.. కసితో పనిచేయండి అంటూ గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ గ్రేటర్ కార్పొరేటర్లతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్, మంత్రులు ఇంకా అబద్ధాలు చెబుతూనే ఉన్నారని మండిపడ్డారు.. దుబ్బాకలో ప్రజలు ఓడించినా కేసీఆర్‌కు బుద్ధి రాలేదన్న ఆయన.. కేసీఆర్‌ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది.. సీఎంగా ఉండేందుకు కూడా ఆసక్తిగా లేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నాడని ఆరోపించిన బండి సంజయ్.. ఇప్పుడు తాను, తన కుటుంబం జైలుకు వెళ్లకుండా ఏం చేయాలో ఆలోచిస్తున్నారు.. అందుకే ఫామ్‌హౌస్‌కు పరిమితం అవుతున్నారంటూ సెటైర్లు వేశారు. ఇక నుంచి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయడం కాదు.. వార్నింగ్‌లే ఇస్తాం.. త్వరలో ఫామ్‌హౌస్ ముట్టడి చేద్దాం అని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడాలి.. ఎట్టి పరిస్థితుల్లో రామచందర్‌రావు గెలవాలని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లు గెలేచెందుకు మీరు, మేం అందరం ఎంతో కష్టపడ్డం.. విజయం సాధించాం.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కష్టపడాలని సూచించారు.