తెలంగాణలో గణేష్ ఉత్సవాలను అడ్డుకుంటే ప్రగతి భవన్ వేదికగా నిమజ్జనం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. వినాయక నిమజ్జనాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించే సీఎస్ సోమేశ్ కుమార్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి నిమజ్జనానికి ఆటంకాలు సృష్టించడం సిగ్గు చేటన్నారు. వెంటనే ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని, లేనిపక్షంలో ప్రగతి భవన్ వేదికగా గణేష్ నిమజ్జనం నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతి ఏటా వినాయక నిమజ్జన ఉత్సవాలు టెన్షన్ వాతావరణంలో జరుపుకునే దుస్థితి టీఆర్ఎస్ పాలనలో ఏర్పడింది. పర్యావరణం ఆటంకాలు, కెమికల్ వాడొద్దనే పేరుతో వినాయక నిమజ్జన ఉత్సవాలు జరగకుండా ఆటంకం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.
Read Also: Chada Venkat Reddy: బీజేపీకి, ఆ పార్టీ నేతలకు చరిత్ర తెలియదు..!
వినాయక ఉత్సవాలు జరుపుకునేందుకు ఏటా రెవిన్యూ, పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ శాఖల అనుమతులు తీసుకోవాల్సిందే. అన్ని అనుమతులు తీసుకున్న తరువాత కూడా ప్రభుత్వం గణేష్ నిమజ్జనానికి ఆటంకాలు సృష్టిస్తోంది.. ఏటా గణేష్ మండపాల సంఖ్యను తగ్గించేందుకు కుట్ర చేస్తోంది. హిందువుల పండుగలంటేనే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశంగా మారుస్తున్నారని విమర్శించారు బండి సంజయ్.. వినాయక ఉత్సవాలు ప్రారంభమై మూడు రోజులు దాటినా ఇప్పటి వరకు నిమజ్జనం కోసం కనీస చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇదేమని ప్రశ్నిస్తే… కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపుతున్న సీఎస్ సోమేశ్ కుమారే నిత్యం కోర్టు ఉత్తర్వులను ధిక్కరించే వ్యక్తి. ఆయన సుప్రీంకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి అడ్డుకోవాలనుకోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు.
కోవిడ్ తీవ్రంగా ప్రబలిన సమయంలోనూ పాతబస్తీలో రంజాన్ సందర్భంగా ర్యాలీలు చేశారు. కోవిడ్ సమయంలో బాదం, పిస్తాలు పంచినా మేమేనాడు అడ్డుకోలేదు. కానీ, గాంధీ ఆసుపత్రిలో కరోనాతో అల్లాడుతున్న వారిని మాత్రం కనీసం పట్టించుకోలేదు. గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నదే మా అభిమతం. భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయినా ప్రభుత్వం నిబంధనల పేరుతో అడ్డుకోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. వినాయక నిమజ్జనానికి ప్రగతి భవన్ ను వేదికగా మారుస్తాం. ప్రజల సౌలభ్యం మేరకు ఏర్పాట్లు చేయాలే తప్ప ప్రభుత్వానికి ఇష్టమైన చోట నిమజ్జన ఏర్పాట్లు చేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ భయపడితే భయపడేది హిందూ సమాజం కాదు. శాంతిభద్రతల సమస్య సృష్టించి ఒక వర్గం ఓట్లు సంపాదించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నాడు అని ఆరోపణలు గుప్పించారు బండి సంజయ్.. కేసీఆర్ కు చేతగాకపోతే తప్పుకోవాలి. ట్యాంక్ బండ్ వద్ద ఏ విధంగా నిమజ్జనం చేసుకోవాలో మాకు తెలుసు. గణేష్ ఉత్సవాల సమయంలో లౌడ్ స్పీకర్లు వాడొద్దని చెబుతున్న ప్రభుత్వానికి దమ్ముంటే.. ఎవరు లౌడ్ స్పీకర్లు ఎక్కువగా ఉపయోగటిస్తున్నారనే అంశంపై చర్చించేందుకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.. ఇక, ఉపాధ్యాయ దినోత్సవం రోజున కేసీఆర్ ప్రభుత్వం 13 జిల్లాల ఉపాధ్యాయులను అరెస్టు చేయడం దారుణం. 317 జీవో విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను టీచర్స్ డే రోజైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రయోజనం ఉంటుందేమోనని భావించి వందలాది మంది టీచర్లను అరెస్ట్ చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు.