జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మొన్నటి వరకు అత్యాచార ఘటనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడితే.. ఎమ్మెల్యే రఘునందర్ రావు మరిన్ని ఆధారాలు బయటపెట్టడం, బాధిత అమ్మాయి విజువల్స్, ఫోటోలను బయటపెడ్డటంతో ఇంకో టర్న్ తీసుకుంది ఈ కేసు. అత్యాచార బాధితురాలి ఫోటోలు, విజువల్స్ ఎలా బయటపెడుతారంటూ.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ పార్టీతో పాటు రఘునందన్ రావుపై ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఈ వివాదంలో రఘునందన్ రావుపై కేసు కూడా నమోదు అయింది.
ఇదిలా ఉంటే అత్యాచార బాధితురాలికి న్యాయం జరిగే వరకు బీజేపీ పార్టీ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో నేరం చేసిన వాళ్లపై కేసులు నమోదు చేయని పోలీసులు.. న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న బీజేపీ నాయకుల, కార్యకర్తలతోపాటు ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు పెట్టడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఈ అత్యాచార ఘటనలో ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా.. దోషులను అరెస్ట్ చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ప్రశ్నించారు.
బీజేపీ నాయకుల, కార్యకర్తలపై కేసు పెట్టేందుకు చూపుతున్న శ్రద్ధ దోషులను అరెస్ట్ చేయడపట్ల చూపితే న్యాయం జరిగేదని అన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నందునే ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఈ తరహా అత్యాచార ఘటనలు రోజుకోటి వెలుగు చూడటం రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి నిదర్శనమని అన్నారు. అత్యాచార ఘటనలు ముమ్మాటికి టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకానితమనే అని విమర్శించారు. నేరాలను అరికట్టడంలో మేమే నెంబర్ వన్ అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ గొంతు ఎందుకు మూగబోయింది.. ఈ ఘటనలపై స్పందించరా.? అని ప్రశ్నించారు. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని, దోషులను శిక్షించే వరకు బిజెపి ఉద్యమిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.
