NTV Telugu Site icon

Bandi Sanjay: సీఎం అవినీతితో తెలంగాణను అప్పుల పాలు చేశారు.

Sanjay

Sanjay

తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ మాటలను,  నాయకులు, అధికారుల మాటలను  పట్టించుకునే పరిస్థితి లేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. బొగ్గు దిగుమతి అంశంలో కేసీఆర్ ప్రజలను పక్కదోవ పట్టించారని అన్నారు. రాష్ట్రం ముఖ్యమంత్రి విచ్చల విడి అవినీతితో తెలంగాణను అప్పు ల పాలు చేశారని.. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసే పరిస్థితి లేదని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగం సంస్థల నుంచి అప్పులు తెచ్చాడని.. కొత్తగా అప్పులు వచ్చే పరిస్థితి లేదని ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.

24 గంటల ఉచిత విద్యుత్ పేరిట పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి రూ. 60 వేల కోట్ల రూపాయలను డిస్కంలకు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అని అన్నారు. పాతబస్తీలో ఏడాదికి రూ. 1000 కోట్లను వసూలు చేయడం లేదని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ లో సపరేట్ సబ్ స్టేషన్ పెట్టుకుని వందల ఎకరాలకు ఉచిత కరెంట్ వాడుకుంటున్నారని విమర్శించారు. 40 గ్రామాలకు ఉపయోగించే విద్యుత్ ను ఫామ్ హౌజ్ కే వాడుతున్నారని ఆరోపించారు.

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలిప్పిస్తానని టీఆర్ఎస్ నేతలు ఎంతో మంది యువకుల నుండి కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేకపోవడంతో వారంతా తిరగబడుతున్నారని గ్రహించి కాలుష్యం పేరుతో ఏకంగా ఫ్యాక్టరీనే మూసివేయించారని విమర్శించారు. ఎక్కడ బీజేపీకి పేరు వస్తుందో అని అక్కసుతోనే ఎరువుల ఫ్యాక్టరీని మూసేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక వేళ మీటర్లు పెడితే టీఆర్ఎస్ నాయకుల బండారం బయటపడుతుందని.. అందుకే మోటర్ల దగ్గర మీటర్లు పెడుతున్నారని బీజేపీని బద్నాం చేశాడని విమర్శించారు. రూ.3కే దొరికే యూనిట్ కరెంట్ ను రూ. 6కు కొని కమీషన్ల రూపంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేది పెద్ద కుంభకోణం అని ఆరోపించారు.  దేశాన్ని కరెంట్ కష్టాల నుంచి బయటపడేలా చేసింది బీజేప ప్రభుత్వమే అని అన్నారు. అన్ని పథకాలను కేంద్రమే చేస్తుంటే టీఆర్ఎస్ తమవిగా చెప్పుకుంటున్నారని విమర్శలు చేశారు.