తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి మండిపడ్డారు. శుక్రవారం నాడు జనగామలో కేసీఆర్ ఎందుకు బహిరంగ సభ పెట్టారో అర్ధం కావడం లేదన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నానని చెప్పడానికే కేసీఆర్ సభ పెట్టి ఉంటారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెడతామని కేంద్రం ఎప్పుడు చెప్పిందని బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెల్లని రూపాయి అని.. ఢిల్లీలో ఆయన్ను ఎవరూ పట్టించుకోరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కథలు చెబుతాడా? సోయి లేకుండా మాట్లాడే కేసీఆర్ మాటలను ఎవరూ నమ్మరని ఫైర్ అయ్యారు.
కేసీఆర్ అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందని.. అందుకే మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలిస్తున్నాడని బండి సంజయ్ నిప్పులు చెరిగారు. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలో, అంబేద్కర్ రాజ్యాంగం కావాలో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలన్నారు. బీజేపీ అంటే కేసీఆర్ భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ పిడికెడు అని కామెంట్ చేసిన కేసీఆర్ ఎందుకు అలా భయపడుతున్నారని నిలదీశారు. త్వరలోనే జనగామలో బహిరంగ సభ పెట్టి టీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.
