దక్షిణ తెలంగాణను పూర్తిగా ఎడారిగా మార్చిన తెలంగాణ ద్రోహివి అని కేసీఆర్ ను విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. లక్ష కోట్లు మింగి కాళేశ్వరాన్ని కట్టావని.. జూరాల, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల సంగతేంటని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం మొత్తం నీటిని దోచుకుంటుందని దాని గురించి మాట్లాడటం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు చాలా మంది ఉన్నారని.. మీ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు పక్కా ఉన్నారని.. అందుకే టెన్షన్ పట్టుకుందని అందుకనే ప్రెస్ మీట్లో వంద సార్లు ఏక్ నాథ్ షిండే జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబ అధికారాన్ని చూసి నాయకులు భయపడుతున్నారు, బాధపడుతున్నారని అనుకుంటున్నారని అన్నారు.
అధికారం కోసం అర్రులు చాస్తే మేం ముఖ్యమంత్రులు అవుతామని.. ఎందుకు ఉపముఖ్యమంత్రి పదవి తీసుకున్నామని ప్రశ్నించారు. దళితున్ని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేవు, ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చావు, ఎంత మంది రైతులకు లక్ష రుణమాఫీ చేశావని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని.. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నాయని.. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరిచిన ఘనత నరేంద్ర మోదీది అని బండి సంజయ్ అన్నారు. గతంలో మోదీది నీతివంతమైన పాలనను కేసీఆర్ పొగిడిన విషయాన్ని గుర్తిచేశారు.
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయాన్ని కేసీఆర్ తెలుసుకోవాలని.. రూ. 19,111 కోట్లను ఈడీ అటాచ్ చేసిందని..బండి సంజయ్ వెల్లడించారు. కేసీఆర్ అవినీతిపై దృష్టి పెడతారని ఇలా చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. మోదీ వస్తే ఎందుకు భయపడుతున్నావని.. మోదీ వస్తే అటు ఇటు వెళ్తావని సీఎం కేసీఆర్ ని ప్రశ్నించారు. తెలంగాణ సమాజం సీఎం కేసీఆర్ ను చూసి నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. చైనాను పొగుడుతాని.. దేశం మీద ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జోకర్ అయ్యాడని అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఎవరో లేఖ రాస్తే మాకేంటి సంబంధం అని బండి సంజయ్ అన్నారు.
ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను ఎందుకు తెలంగాణలో అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కరోనా సమయంలో కనీసం బయటకు వచ్చి మాట్లాడలేదని.. మోదీ గారు తెలంగాణలోకి వస్తే నీకు జ్వరం వస్తుందని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచావని.. కరెంట్ ఛార్జీలు పెంచావని.. అనేక ఉద్యోగులకు ఇప్పటికీ జీతం లేదని కేసీఆర్ ను విమర్శించారు. తెలంగాణలో రైతులు చనిపోతుంటే, వేరే రాష్ట్రం వారికి రూ. 3 లక్షలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు.
