TRS MLA Balka Suman Fired On BJP Leaders.
బీజేపీ నేతలు ఇందిరా పార్కు దగ్గర చేసిన దీక్షలో మా మీద చేసిన విమర్శలు అర్థరహితమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఏదో తెలంగాణలోనే మొదలయినట్టు బీజేపీ నేతలు నీతులు చెబుతున్నారని, బీజేపీకి రాష్ట్ర ప్రభుత్వాలు లేవా.. స్పీకర్లు లేరా.. వారు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ను అక్కడ సస్పెండ్ చేయడం లేదా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలు తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికే దీక్షలు చేస్తున్నారని, బీజేపీ నేతలు కేసీఆర్ పై కండకావరంతో మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
మీరు మా సీఎం కేసీఆర్ ను అన్నట్టుగా పీఎం మోడీ, హోం మంత్రి అమిత్ షా ను అసభ్యంగా తిట్టొచ్చు, సభ్య సమాజం బీజేపీ ఎమ్మెల్యేల తీరును హర్షించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వెళితే మానవత్వం లేకుండా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని, బీజేపీ నేతల విధానం విధ్వంసం.. మా విధానం వికాసమని ఆయన అన్నారు. బుల్డోజర్ల భాష వాడుతూ తెలంగాణ పల్లెల్లో విధ్వంసం సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. మేము కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంచుతుంటే బీజేపీ బుల్డోజర్లతో ప్రజలను తొక్కించాలని చూస్తోందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.