శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాచలం ముస్తాబవుతోంది. శ్రీసీతారామచంద్రస్వామి వారి కళ్యాణం ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే రెండో అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ మేరకు ఏప్రిల్ 2 నుంచి 16 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 10న శ్రీరాముల వారి కల్యాణం, 11న పట్టాభిషేకం నిర్వహించనున్నారు.
కరోనా కారణంగా గత రెండేళ్లుగా స్వామి వారి కల్యాణానికి పరిమిత సంఖ్యలోనే అధికారులు భక్తులను అనుమతించారు. ఈ ఏడాది కోవిడ్ ఆంక్షలను ఎత్తివేయడంతో లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో సోమవారం నాడు శ్రీరామనవమి ఉత్సవాలపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమీక్షించారు. భద్రాచలం జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులు, పోలీసు, పంచాయతీ రాజ్, విద్యుత్, రవాణా, గ్రామ పంచాయతీ, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, ఫైర్, రెవెన్యూ, ఎండోమెంట్ శాఖల అధికారులు, ఆలయ అర్చకులతో సమీక్ష నిర్వహించారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున 3 లక్షల స్వామివారి ప్రసాద లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక వసతి, మరుగుదొడ్లు, ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు.
https://ntvtelugu.com/minister-ktr-says-education-system-needs-to-change/
