తెలంగాణ మంత్రి కేటీఆర్, ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా.. ఇద్దరూ ఇద్దరే… సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ.. అన్ని సమస్యలపై స్పందిస్తుంటారు.. వీరి పోస్టులు ఓసారి ఆలోచింపజేస్తే.. మరోసారి నవ్వు పెట్టిస్తాయి.. ఇంకోసారి పెట్టుబడులు తెస్తాయి.. మరికొన్ని సార్లు కొత్త ప్రాజెక్టులకు అడుగులు వేస్తాయి.. అయితే, సోషల్ మీడియా వేదికగా.. ఒకరికొరరు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.. దానికి ప్రధాన కారణం మాత్రం.. ‘ఫార్ములా ఈ’గానే చెప్పాలి.. ప్రతిష్టాత్మక ‘ఫార్ములా ఈ’ వరల్డ్ ఛాంపియన్‌షిప్ రేసు కోసం హైదరాబాద్ నగరం వేదికగా ఖరారైంది.. దీనిపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు.. ‘సొంత గడ్డపై తమ రేసింగ్ కార్లను ఉరుకులు పెట్టబోతున్నాయి.. చిరకాల కల నెరవేరబోతోంది.. ఈ కలను నెరవర్చేదిశగా ప్రయత్నాలు చేసిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు అంటూ ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Read Also: హైకోర్టు కీలక నిర్ణయం.. ఇక అన్నీ ఆన్‌లైన్‌లోనే..
ఇక, ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై రెస్పాండ్ అయిన మంత్రి కేటీఆర్.. ధన్యవాదాలు ఆనంద్ జీ అంటూ స్పందించారు.. హైదరాబాద్ వేదికగా జరగబోతోన్న ఈ రేసింగ్‌లో మహీంద్రా రేసింగ్ మంచి ముగింపుతో స్థానిక ప్రేక్షలను ఉత్సాహపరుస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.. మరోవైపు, హైదరాబాద్‌ను బలమైన ఈవీ హబ్‌గా మార్చడంలో మీ మార్గదర్శకత్వం మరియు మద్దతు అవసరం అని తన ట్వీట్‌లో ఆనంద్ మహీంద్రాను ఉద్దేశించి పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. కాగా, ఫార్ములా ఈ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో- తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. సంయుక్తంగా ABB FIA ఫార్ములా E ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల నిర్వహణ గురించి సోమవారం ప్రకటించారు. ఇదే సమయంలో మహీంద్రా రేసింగ్ అందిస్తున్న మద్దతును కూడా అల్బెర్టో లాంగో ప్రస్తావించారు. ఈ రేసింగ్ పోటీలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ప్రత్యేక రేసింగ్ ట్రాక్ అక్కర్లేని ఈ ‘ఇ వన్ ఫార్ములా’ ఛాంపియన్‌షిప్ పోటీలు 2014 నుంచి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్వహిస్తూ వస్తున్నారు.. ఈ బృందంలో మహీంద్రా రేసింగ్ కంపెనీ కూడా భాగస్వామిగా ఉండడం మరో విశేషం. లండన్, న్యూయార్క్, మెక్సికో, రోమ్, బెర్లిన్, రోమ్, సియోల్, వాంకోవర్ లాంటి సిటీల్లో ఈ పోటీలు నిర్వహించగా… ఈ పోటీల తొమ్మిదో సీజన్ మాత్రం సౌదీ అరేబియాలోని దిరియా సిటీలో జరగబోతోంది.. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరగనుంది.
