Amit Shah Speech At Munugodu Samarabheri: దళితుడ్ని సీఎం చేస్తానని మాటిచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయన వెళ్లాక కేటీఆర్ బరిలోకి దిగుతాడని.. అంతేగానీ వాళ్లు దళితుడ్ని సీఎం చేయరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మునుగోడు సమరభేరిలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పతనానికి ఇది నాంది అని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని అన్నారు. ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే.. ఒక పొగ మాదిరిగా కేసీఆర్ ప్రభుత్వం మాయమవుతుందన్నారు. సెప్టెంబర్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని కేసీఆర్ ఇచ్చిన మాటను తప్పారని.. కానీ తాము అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న కచ్ఛితంగా విమోచన దినం జరుపుతామని చెప్పారు. మజ్లిస్‌కి భయపడే.. కేసీఆర్ ఆ హామీని అమలు చేయడం లేదని అమిత్ షా ఆరోపించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అండ్ కంపెనీ బూటకపు హామీలకు పెట్టింది పేరని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలనెలా రూ.3 వేల భృతి, నల్గొండ జిల్లా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్న హామీలను నెరవేర్చలేదని అన్నారు. ఆ హామీల సంగతి దేవుడెరుగు.. చివరికి ప్రధాని మోదీ మంజూరు చేస్తున్న టాయిలెట్లను సైతం ప్రజలకు అందకుండా సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని అమిత్ షా ఫైరయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా తెచ్చిన దళిత బంధు పతకాన్ని సైతం నీరుగార్చారన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబానికి తప్ప, యువకులకు ఉపాధి లభించలేదని అమిత్ షా వాపోయారు.
రైతులు తెలంగాణలో బాగా నష్టపోతున్నారని, ప్రధాని భీమా పథకం ఇక్కడ అమలు చేయడం లేదని అమిత్ షా అన్నారు. కనీస మద్దతు ధరతో ధాన్యం కొనడం లేదన్నారు. తాము ప్రతి రైతు కుటుంబం నుంచి ప్రతి కిలో ధాన్యం సేకరిస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎంలా మారిందన్నారు. పెట్రోల్ ధరల్ని మోదీ రెండుసార్లు తగ్గించారని, కానీ కేసీఆర్ ఒక్కసారి కూడా తగ్గించలేదన్నారు. రాజగోపాల్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపిస్తే, తెలంగాణలో అమలుకాని వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ వస్తే.. గంగా ప్రవాహంలా తెలంగాణను అభివృద్ధి పరుస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని, విజయ సంకల్పం అందరూ తీసుకోవాలంటూ అమిత్ షా కోరారు.