NTV Telugu Site icon

BJP: తెలంగాణకు అమిత్‌షా, నడ్డా.. ఈసారి ఏంటో మరి..?

Amit Shah And Jp Nadda

Amit Shah And Jp Nadda

తెలంగాణలో రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. టీఆర్ఎస్‌, బీజేపీ మధ్య… మాటలతూటాలు పేలుతున్నాయి. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. గులాబీ పార్టీ బీజేపీని టార్గెట్‌ చేస్తూ… కేంద్ర ప్రభుత్వం, మోడీకి విజన్ లేదని విమర్శలు గుప్పిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా అధికార టీఆర్‌ఎస్‌పై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతోంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో దూసుకుపోతున్నారు. ఇదే సమయంలో అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది కమలం పార్టీ. ఈనెల 5న జేపీ నడ్డా, 14న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఇద్దరు నేతలు తెలంగాణకు వస్తుండటంతో… రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: Covid 19: కరోనా బులెటిన్‌ విడుదల నిలిపివేత..

జేపీ నడ్డా, అమిత్‌ షా…ఒకరి తర్వాత ఒకరు వస్తుండటంతో… అధికార పార్టీపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది. పార్టీ శ్రేణులకు ఏ భరోసా ఇస్తారు.. కేంద్రం, బీజేపీ పై చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది… పార్టీ శ్రేణులు కూడా వారి సభలపై భారీ ఆశలు పెట్టుకున్నాయి. జేపీ నడ్డా సభకు భారీ స్థాయిలో జన సమీకరణ చేయాలని పార్టీ నిర్ణయించింది. మండలాలు, గ్రామాలు, బూత్‌ల వారీగా జనాన్ని సమీకరించేందుకు ప్లాన్‌ చేశారు. సభకు లక్ష మందికిపైగా తరలి వస్తారని బీజేపీ నేతలు అంటున్నారు. బండి సంజయ్‌ యాత్ర సాగిన మండలాల వారీగా… వాహనాలు సిద్ధం చేస్తున్నారు.