Site icon NTV Telugu

Babli Project Gates: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల

Babli Project

Babli Project

Babli Project Gates: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు మొత్తం 14 గేట్లను సోమవారం తెరిచారు. గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు నుంచి మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల సమక్షంలో నీటిని విడుదల చేశారు. 80 కి.మీ దిగువన ఉన్న ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టు అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌కు నీటిని వచ్చేలా చూసేందుకు ప్రతి సంవత్సరం జులై 1న ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. అక్టోబర్ 28వ తేదీ వరకు గేట్లు ఎత్తే ఉంచాలని 2013 ఫిబ్రవరి 28న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 28 వరకు అధికారులు గేట్లు తెరిచి ఉంచనున్నారు. ఈ క్రమంలోనే శ్రీరాంసాగర్‌లోకి వరద ప్రవాహం పెరగనుంది. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రతి ఏడాది మహారాష్ట్ర అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నారు.

Read Also: CM Revanth Reddy: గవర్నర్ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

ఇదిలా ఉండగా.. ఈ వారం ఎస్సారెస్పీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి కాస్తా వరదనీరు వచ్చి చేరుతోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నుంచి వరద వచ్చి చేరుతోంది. బ్యారేజీకి 14,500 క్యూసెక్కుల మేర వరద రాగా.. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచన మేరకు అన్ని గేట్లను ఎత్తి ఉంచారు. దీంతో వచ్చిన వరద వచ్చినట్లుగా దిగువకు వెళ్లిపోతోంది. వరద రావడంతో తాత్కాలిక పనుల కోసం తెచ్చిన యంత్రాలు, సామగ్రిని తరలించారు. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Exit mobile version