Book Launch: ఆర్ధిక శాస్త్రంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసిన ఆకిన వెంకటేశ్వర్లు తాజాగా పొలిటికల్ ఎకానమీ ఆఫ్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని హైదరాబాద్‌లోని సెస్‌లో మాజీ ప్రణాళిక సంఘం సభ్యుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సీహెచ్ హనుమంతరావు ఆవిష్కరించారు. ఈ పుస్తకం 572 పేజీలలో 22 అధ్యాయాలుగా విభజించబడింది. ఇందులో ముఖ్య విషయాలన్నీ భారత దేశ వ్యవసాయ రంగం, అభివృద్ధి, ఎత్తుపల్లాల గురించి ఉంటుంది. బ్రిటీష్ వారు భారతదేశ వ్యవసాయాన్ని ఆహార పంటల నుంచి వాణిజ్య పంటల వైపు మళ్లించారు.. దాని పర్యావసనాలపై పుస్తకంలో ఆకిన వెంకటేశ్వర్లు వివరించారు. ఆయన తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఆర్ధికశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. 2002లో హైదరాబాద్‌లోని ఆర్ధిక, సామాజిక శాస్త్రాల అధ్యయన కేంద్రం (సెస్)లో పనిచేసి తర్వాతి కాలంలో అక్కడే సలహాదారుగా సేవలు అందించారు.
Read Also: రోజూ కోడిగుడ్డు తింటే.. ఇవి మీ సొంతం..!
స్వాతంత్ర్యం అనంతరం ఆహార ధాన్యాల కొరత తీర్చడానికి అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం, భూసంస్కరణల ద్వారా జమీందారీ విధానం రద్దు, కౌలుదారు చట్టాల అమలు, దున్నేవానిదే భూమి-దాని పరిస్థితి, 1966లో తీవ్ర ఆహార ధాన్యాల సంక్షోభం ద్వారా సస్య విప్లవ దిగుమతి జరిగింది. భూగరిష్ట పరిమితి అమలు జరిగిన గ్రామీణ ప్రాంతాలలో సంక్షోభం, ప్రజాపంపిణీ వ్యవస్ధ కోసం భారత ఆహార సంస్థ ఏర్పడటం, ఎఫ్‌సీఐ ఆహార ధాన్యాల కనీస మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేయడం, 1991లో వచ్చిన నూతన ఆర్ధిక విధానాలు అమలు కావడం, 1995లో వరల్డ్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ చేరిన తర్వాత భారతదేశ రైతులు ఎగుమతులు పెంచుకోవచ్చనే విధానంలో పత్తి, మిర్చి పంటలు పండించగా రసాయనిక ఎరువులు, పురుగులమందు ధరలు పెరగడం వల్ల, ప్రభుత్వ సబ్సిడీలు తగ్గడం వల్ల, గిట్టుబాటు ధరలు తగ్గడం వల్ల రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. రెండో సస్య విప్లవం కోసం బీటీ పత్తిని పెంచడం పెరిగింది. కానీ కనీస మద్దతు ధరలు ఉన్నా రైతులు నష్టాల బారిన పడటం వంటి అంశాలను పుస్తకంలో వివరించారు.