NTV Telugu Site icon

Agnipath Protests: ఆగని అగ్నిపథ్‌ ఆందోళనలు.. వరంగల్‌లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌

Congress Vs Bjp

Congress Vs Bjp

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెర మీదికి తెచ్చిన అగ్నిపథ్‌ పథకంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ హనుమకొండలో కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా నిరసన చేపట్టింది. బీజేపీ జిల్లా ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించింది. దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ పార్టీ కార్యాలయం ముందు ఆందోళన చేయటం ఏంటని బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ పార్టీ నేతల్ని ప్రశ్నించారు. బీజేపీ ఆఫీసులోకి రాకుండా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను ప్రతిఘటించారు. ఈ సందర్భంగా వాదులాట జరిగింది. బీజేపీవాళ్లు కాంగ్రెస్‌ నేతల వాహనాలపై దాడి చేశారు. దీంతో కార్ల అద్దాలు పగిలిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాల పైన లాఠీచార్జీకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

అగ్నిపథ్‌పై గతంలోనే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ ఇవాళ హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యకర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైన సమయంలో ధర్నా చేపట్టడం గమనార్హం. తద్వారా ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ భావించింది. బీజేపీ ఆఫీసు వద్ద కాకుండా వేరే ఎక్కడ నిరసన చేసినా ఇంత పబ్లిసిటీ రాదనేది హస్తం పార్టీ ఆలోచన. సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల అగ్నిపథ్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా అగ్నివీర్‌లను నియమిస్తారు. ఈ మేరకు అగ్నివీర్‌ల రిజిస్ట్రేషన్లు సైతం జరుగుతున్నాయి. ఇప్పటికే లక్ష మందికి పైగా అభ్యర్థులు అప్లై చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ కొత్త నియామక విధానాన్ని కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నాలుగేళ్ల తర్వాత అగ్నివీర్‌ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తోంది. సైనికులను అడ్డా మీద కూలీల్లా మార్చొద్దని హితవు పలుకుతోంది.

Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. గడువు మరో 6 రోజులే!