NTV Telugu Site icon

Agency Ladies Problems: గిరిజన గూడాల్లో బాలింతల కష్టాలు

Lady2

Lady2

ఎంతమంది పాలకులు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఆదివాసీల తలరాతలు మాత్రం మారడం లేదు. రోడ్డు, రవాణా సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో పచ్చి బాలింత పది కిలో మీటర్లు పసిబిడ్డతో నడిచి ఇంటికి చేరుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొమురం భీం జిల్లాలో మారుమూల గ్రామాలకు రోడ్ల కష్టాలు తీరడం లేదు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గోవెన నాయకపుగూడ గ్రామానికి సరిగ్గా రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఈ బాలింత ఇంటికి చేరాలంటే నడుచుకుంటూ గొడుగు నీడన కష్టాలు పడాల్సి వచ్చింది.

ఈ గ్రామానికీ చెందిన నాగమ్మ- పరమేశ్ దంపతులకు రెండో సంతానంగా అమ్మాయి జన్మించింది. ప్రసవం కోసం నాగమ్మ నిర్మల్ జిల్లాలోని పుట్టింటికి వెళ్ళగా అయిదురోజుల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. ప్రత్యేక వాహనంలో నిర్మల్ నుంచి ఆసిఫాబాద్ వరకు.. అక్కడి నుంచి బలాన్పూర్ వరకు వచ్చారు. బలాన్పూర్ నుంచి వారి స్వగ్రామం గోవెన నాయకపుగూడ పది కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఆ ఊరికి చేరుకోవాలంటే దారిమధ్యలో రెండు చిన్నపాటి కొండలు, వాగులు దాటాలి. గ్రామానికి ఏర్పాటు చేసిన తాత్కాలిక దారి వర్షాలకు కోతకు గురై ఆధ్వానంగా మారింది.

ఈ మార్గంలో ద్విచక్ర వాహనమే అతికష్టం మీద వెళ్తుంది, ఈ నేపథ్యంలో బాలింత నాగమ్మ వేరే దారి తోచక దగ్గరి బంధువు సాయంతో పది కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకుంది. ప్రసవ సమయంలో ఆదివాసీ గూడాల్లో మహిళలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీకావు. రోడ్డు సౌకర్యాలు లేకపోవడంతో మార్గం సరిగ్గా లేక అంబులెన్స్ వచ్చే దారి లేక గతంలో గర్భిణీ లతో పాటు, అప్పుడే పుట్టిన పిల్లలు ప్రాణాల కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. గర్భిణీల కాలినడక, ప్రసవ సమయంలో ఇబ్బందులు ఏజెన్సీ ప్రాంతాల్లో నిత్య కృత్యం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యాలు లేని ఆదివాసీ గ్రామాలకు రోడ్లు మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tirumala Bears: తిరుమలలో ఎలుగుబంట్ల హల్ చల్