NTV Telugu Site icon

కరోనా విజృంభణ.. సంక్రాంతి తర్వాత స్కూళ్లు నడిచేనా..?

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది.. నిన్న లక్ష దాటేసి 1.14 లక్షలకు పైగా కేసులు నమోదైతే.. ఇవాళ ఏకంగా 1,41,986 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ క్రమంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. తెలంగాణలో నిన్న దాదాపు 3 వేల పాజిటివ్‌ కేసులు వెలుగు చూడగా.. ఆంధ్రప్రదేశ్‌లో 840 కేసులు నమోదు అయ్యాయి.. కోవిడ్‌ ఆంక్షలు కూడా విధించింది ఆంధ్రప్రదేశ్‌.. ఇవాళ్టి నుంచి నైట్‌ కర్ఫ్యూకు వెళ్తున్నారు.. ప్రస్తుతానికి తెలంగాణలో మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు.. సాధారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది. మరోవైపు.. ఇవాళ్టి నుంచి తెలంగాణలో సంక్రాంతి సెలవులు ప్రారంభం అయ్యాయి.. గతంలో కంటే ఈసారి ఎక్కువ సెలవులే ఇచ్చింది సర్కార్‌.. సంక్రాంతి సెలవుల తర్వాత షెడ్యూల్‌ ప్రకారం అయితే ఈ నెల 17వ తేదీ నుంచి అన్ని స్కూళ్లు, విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకోవాల్సి ఉంది.. కానీ, అప్పటి వరకు పరిస్థితి ఏంటి? మళ్లీ విద్యాసంస్థలు తెరుచుకుంటాయా? లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Read Also: సంక్రాంతి ఎఫెక్ట్‌.. మళ్లీ పెరిగిన రైల్వే ప్లాట్‌ఫాం టికెట్‌ ధర

దీనికి ప్రధాన కారణం తెలంగాణలో క్రమంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ పోవడమే… ఇప్పటికే భారత్‌లో థర్డ్‌ వేవ్‌ ప్రారంభమైందని.. 15కు పైగా రాష్ట్రాల్లో ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఇక, రాష్ట్రంలోనూ వరుసగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సంక్రాంతి సెలవుల తర్వాత తిరిగి విద్యాసంస్థల ప్రారంభంకావడంపై సందేహం నెలకొంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 11 నుంచి స్కూళ్లకు, 13వ తేదీ నుంచి కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాల్సి ఉండగా.. దానిని ముందుకు జరిపి.. ఇవాళ్టి నుంచే విద్యాసంస్థలకు సర్కార్ సెలవులు ఇచ్చారు సీఎం కేసీఆర్. 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వగా.. 17న తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, కరోనా కేసులు ఎక్కువవుతుండడంతో ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సెలవుల తర్వాత భౌతిక తరగతులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కష్టమేననే చర్చ సాగుతోంది.. మరోవైపు, మళ్లీ ఆన్​లైన్, టీవీ పాఠాల కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.. కోవిడ్‌ ఎఫెక్ట్‌తో అంతా భౌతిక తరగతులకు దూరమై.. ఆన్‌లైన్‌ క్లాసులకే పరిమితం అయ్యారు.. దీంతో విద్యావ్యవస్థ గాడీ తప్పి, విద్యార్థులు సబ్జెక్ట్‌ పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి కూడా.. వారి ప్రవర్తనలోనూ చాలా మార్పులు వచ్చాయి.. అయితే, సుదీర్ఘ విరామం తర్వాత సెప్టెంబర్ నుంచి మళ్లీ ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యాయి.. ఇప్పటికీ కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు ఆన్‌లైన్‌ బోధనే కొనసాగిస్తున్నాయి.. ప్రభుత్వ స్కూళ్లు అన్ని.. చాలా వరకు ప్రైవేట్‌ స్కూళ్లు కూడా భౌతిక తరగతులు ప్రారంభించాయి.. ఇప్పుడిప్పుడే విద్యావ్యవస్థ గాడిన పడుతోంది.. విద్యార్థులు కాస్త చురుకుగా కనిపిస్తున్నారు.. ఈ సమయంలో.. మళ్లీ కోవిడ్, ఒమిక్రాన్‌ టెన్షన్‌ పెడుతోంది.. మళ్లీ ఆన్‌లైన్‌ క్లాసులకు వెళ్తే పరిస్థితి ఏంటి? అనే చర్చ మొదలైంది.